ఎన్టీఆర్ ట్రస్టుపై దర్యాప్తునకు చంద్రబాబు సిద్ధమా!

హైదరాబాద్ 19 జూన్ 2013:

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వ్యవహారంపై దర్యాప్తునకు సిద్ధమా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాలు చేసింది. విజయసాయి రెడ్డిని రిజర్వు బ్యాంకు డైరెక్టరుగా నియమించాలని కోరుతూ మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లేఖ రాసిన అంశాన్ని తప్పు పడుతూ ఈనాడు పత్రికలో వచ్చిన అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను ప్రశ్నించింది. ఈ అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బలహీనపడుతుందేమోననే ఉద్దేశంతో టీడీపీ, దానికి మొదటినుంచి వత్తాసు పలుకుతున్న రామోజీరావు సారథ్యంలోని ఈనాడు పత్రిక కొత్త కుట్ర పన్ని కథనాలు రాయడం మొదలుపెట్టాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. మొదటినుంచి ఈనాడులో కథనం రావడం.. వెంటనే టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం.. లేకపోతే టీడీపీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఆ వెంటనే ఈనాడులో దాన్ని పెద్దది చేసి చూపడం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందేనన్నారు. ఈ రెండు పరస్పరం కలిసి ఎలా పనిచేస్తూ వస్తున్నయో చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత రేపు సీబీఐ ఏంచేయబోతోందో ఈనాడు పత్రికలో ముందే వచ్చిన అంశాన్నీ గమనించామన్నారు. 'చరిత్రను మరిచిపోండి.. చెప్పింది వినండి' అనే సూత్రాన్ని ఈనాడు పత్రిక పాటిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సీబీఐ చార్జిషీటులో ఫలానాది ఉంటుందని ఈనాడు ముందే చెబుతుందన్నారు. కానీ ఆవిషయం మీకెలా తెలుసు అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరని తెలిపారు. టీడీపీ ఆఫీసుకు ఎలా తెలుసో కూడా జవాబు చెప్పరన్నారు. ఈనాడు రాసింది కాబట్టి మేం ప్రెస్ మీట్ పెట్టేస్తాం అనే రీతిలో ఆ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రిజర్వు బ్యాంకు డైరెక్టరుగా విజయసాయి రెడ్డిని నియమించమని మహానేత డాక్టర్ వైయస్ఆర్ గవర్నరుకు లేఖ రాశారనేది ఓ కథనమని చెప్పారు. ఓబీసీ డైరెక్టరుగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి సూచనల మేరకు భారతి సిమెంట్సుకు 200 కోట్లకు రుణం ఇచ్చారనీ.. ఆయన టీటీడీ సభ్యుడిగా కూడా ఉన్నారనీ ఆ కథనంలో పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డిగారు ఎంతో పెద్ద తప్పుచేశారంటూ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఆ కథనంలో నిరూపించడానికి నానా తంటాలూ పడ్డారన్నారు. ఇంతకీ అది రామోజీరావు ఇంట్లో దొరికిన ఎలకేనని ఎద్దేవా చేశారు. తోకను పట్టుకుని ఆడిస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప మరొకటి కాదన్నారు.

విజయసాయి రెడ్డి అనే వ్యక్తి టీటీడీకి సభ్యుడిగా ఉండడానికి అనర్హుడా అని గట్టు సూటిగా ప్రశ్నించారు.   ఎదుటి వాణ్ణి తిట్టడం.. వారినెవరైనా తిడితే సమాధానం చెప్పకపోవడం అనే సూత్రాన్ని ఈనాడు, టీడీపీ సూత్రాన్ని నేర్చుకున్నాయని చెప్పారు. ఇంతకుముందులా సమాధానం చెప్పకుండా ఉండకుండా తానడుగుతున్న ప్రశ్నలకు బదులు చెప్పాలి లేదా ముక్కు నేలకు రాయాలి అని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి చార్టెర్డు అకౌంటెంట్.. చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అనుభవశీలి. ఆయనను టీటీడీలో డైరెక్టరుగా ఉంచాలని రాజశేఖరరెడ్డిగారు లేఖ రాయడం తప్పా? ఇలాంటి లేఖలు ప్రభుత్వాలు రాయవా? రామోజీరావు కానీ, టీడీపీ కానీ ఎప్పుడూ ఇలాంటి సిఫార్సులు చేయలేదా? చేస్తే తప్పా.. అనే అంశాలు తేల్చాల్సిన అవసరముందన్నారు. రాజశేఖరరెడ్డిగారు విజయసాయిరెడ్డిని రిజర్వు బ్యాంకు డైరెక్టరుగా నియమించాలని లేఖ రాశారు తప్ప ఆయన డైరెక్టరు కాలేదే? ఈ అంశంపై టీడీపీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి ఆర్బీఐ డైరెక్టరై ఉండుంటే 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఉండే వాడని ఆరోపించేసింది. ఒక ఆడిటర్ని ప్రతి బ్యాంకూ డైరెక్టరుగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయన్నారు. దానికి రాజకీయ సిఫార్సులు ఉంటాయన్నారు. అది తప్పనుకుంటే ఒక్కసారి చరిత్రను పరిశీలించమని గట్టు కోరారు.

టీడీపీ అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్‌గా ఎన్టీరామారావు కుటుంబానికీ, చంద్రబాబు, రామోజీరావు సంస్థలకూ ఆడిటర్‌గా ఉన్న బ్రహ్మయ్య కంపెనీకి చెందిన దేవినేని సీతారామయ్యను నియమించలేదా అని ఆయన ప్రశ్నించారు. ఇది తప్పా కాదా.. ఇది తప్పయితే ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీతారామయ్యగారంటే తమకు ఎంతో గౌరవముందన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే  సీతారామయ్యను ఏపీఐడీసీకి డైరెక్టరుగానూ నియమించిన సంగతి నిజమా కాదా చెప్పాలన్నారు. ఏమాశించి ఆయనకీ పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సీతారామయ్యగారిని రిజర్వు బ్యాంకు సదరన్ డైరెక్టరుగా నియమించిందీ నిజమా కాదా చెప్పాలన్నారు.

ఓబీసీ నుంచి భారతి సిమెంట్సుకు 200 కోట్ల రూపాయల రుణాన్నిచ్చారని చెబుతున్నారు.. జగన్మోహన్ రెడ్డిగారు బ్యాంకు నుంచి రుణం తీసుకోకూడదా.. ఆ ఒక్క బ్యాంకు నుంచే ఆయన రుణం తీసుకున్నారా అని అడిగారు. తానే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని రామోజీరావు గుండెలమీద చేయి వేసుకుని చెప్పాలని డిమాండు చేశారు. రుణాలు తీసుకోవడం తప్పా.. భారతి సిమెంట్ దొంగ సంస్థ కాదే? రాజశేఖరరెడ్డిగారు లేఖ రాస్తే రుణమిచ్చారట. అలాగైతే దేవినేని సీతారామయ్య ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు.. అందులో రామోజీరావుకూ, చంద్రబాబుకూ ఎంతిచ్చారో  చెప్పాలని కోరారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తికి కూడా ఎంత వాటా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నానన్నారు. మూడు పదవులూ అనుభవించిన దేవినేని సీతారామయ్య ఈరోజు కూడా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ట్రస్టు సభ్యునిగా ఉన్నారన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు ఒక పబ్లిక్ ట్రస్టు. అందులో పబ్లిక్ ఆస్తులే ఉండాలి కానీ ప్రైవేటు ఆస్తులన్నీ పెట్టి చంద్రబాబు నాటకాలాడుతున్నారని గట్టు పేర్కొన్నారు. ఇది నిజం కాదా? ఇందులో ముగ్గురే ఉన్నారనీ వారిలో చంద్రబాబు, భువనేశ్వరి కాక దేవినేని సీతారామయ్య కూడా ఉన్నారన్నారు. పబ్లిక్ ఆస్తిని సొంత ఆస్తిలా వాడుకుంటూ ప్రజలకు లెక్క చెప్పకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని చెప్పారు. ఈ ట్రస్టు మీద దర్యాప్తునకు సిద్ధమా అని ఆయన సవాలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడిగా, ట్రస్టు అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తనకు స్థలం కేటాయించాలని లేఖ రాయగా ప్రభుత్వం మంజూరు చేసిందట.  మీ ట్రస్టు భవన్లో ప్రైవేటు మీటింగులు పెట్టుకోడానికి అనుమతిస్తారా అని అడిగారు. ఈ ట్రస్టు ప్రభుత్వానిదా కాదా.. అందులో చంద్రబాబు భార్య, దేవినేని సీతారామయ్య సభ్యులుగా ఉన్నారా లేదా అని నిలదీశారు. ఆ ట్రస్టు భవన్ నీ కుటుంబానిదా కాదా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని సీతారామయ్యకు ఇన్ని పదవులు కట్టబెడితే గానీ రాజశేఖరరెడ్డి గారు ఒక లేఖ రాస్తే తప్పయిందా అని నిలదీశారు. పత్రికాధిపతిగా ఉన్న రామోజీ రావు రిజర్వు బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినపుడు డైరెక్టరుగా ఉన్న దేవినేని సీతారామయ్య కాపాడింది నిజమా కాదా అని అడిగారు. రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్ 45ఎస్ 1934 ప్రకారం కంపెనీ కాని చోట ఏ ఒక్క వ్యక్తి దగ్గరా డిపాజిట్లు తీసుకోకూడదని చెప్పారు. మార్గదర్శి సంస్థకు 2500 కోట్ల రూపాయలు డిపాజిట్లను రామోజీరావు సేకరించారా లేదా అని ప్రశ్నించారు. అప్పట్లో ఆయనపైనా ఏ చర్య తీసుకోకుండా దేవినేని కాపాడారా లేదా.. అని కూడా అడిగారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన రామోజీ రావు 250 కోట్ల రూపాయల ఆదాయపు పన్నును ఎగ్గొట్టారా లేదా కూడా చెప్పాలన్నారు.

Back to Top