వైయస్ఆర్ జిల్లా : రాయలసీమలో తీవ్ర తాగునీటి, సాగునీటి సమస్య నెలకొన్నప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, మాజీ మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ రాయలసీమ రైతులు, ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాయలసీమపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిసి ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండగా, శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం వస్తోందని తెలిపారు. అయినప్పటికీ రిజర్వాయర్ నీటిమట్టం 854 అడుగులకు చేరినా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయకపోవడం రాయలసీమపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వంటి పట్టణాల్లో తాగునీటి తీవ్ర కొరత నెలకొందని, కనీసం తాగునీటి అవసరాల కోసమైనా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గత రెండేళ్లలో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. శ్రీశైలం పూర్తిగా నిండే వరకు విద్యుత్ ఉత్పత్తి లేదా దిగువ ప్రాంతాల పేరుతో నీటిని విడుదల చేయకుండా రాయలసీమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తూ, వెంటనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేయాలని, లేకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.