విజయమ్మతో జలగం, సంకినేని వెంకటేశ్వరరావు భేటీ
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత
నవంబర‌్ 19న ఖమ్మంలో విజయమ్మ సమక్షంలో చేరతా: జలగం
నవంబర్ 11న నేను చేరతా: సంకినేని వెంకటేశ్వరరావు
హైదరాబాద్, 15 అక్టోబర్ 2012: టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాటలకు ఏ మాత్రమూ విశ్వసనీయత లేదని సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. అవకాశవాదులకే టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయిన చంద్రబాబు జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించి తాను అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కాంగ్రెస్), నల్లగొండ జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు (టిడిపి) ఆదివారం ఉదయం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో కలిశారు. విజయమ్మతో విడివిడిగా సమావేశమైన వీరిద్దరూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ, వైయస్‌ఆర్ సిపిలో చేరాలని తాము నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలను వివరించారు.
ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ, తాను పార్టీని వీడుతున్నట్లు వార్తలు రాగానే 2013లో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు కబురు పంపారని చెప్పారు. అయితే, బాబు మాటలకు విశ్వసనీయత ఎంత ఉంటుందో తనకు స్పష్టంగా తెలుసని, జగన్మోహన్‌రెడ్డితో కలిసి పనిచేయాలని దృఢంగా నిర్ణయించుకున్నానని చెప్పారు. నవంబర్ 11వ తేదీన సూర్యాపేటలో పెద్ద బహిరంగసభ నిర్వహించి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 30 ఏళ్లుగా తనతో పాటు టిడిపిలో పనిచేస్తున్న తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వైయస్‌ఆర్ సీపీలో చేరతారని సంకినేని తెలిపారు.
జలగం వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కలుషిత రాజకీయ వాతావరణంలో వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం చాలా అవసరమని భావిస్తున్నానని అన్నారు. అన్నివిధాలుగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని జగన్ అయితేనే ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం తనకు ఉన్నదని, అందుకే తాను వైయస్‌ఆర్ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. నవంబర్ 19న ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి విజయమ్మ సమక్షంలో తాను, తన అనుచరులు, జలగం కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వివరించారు.
గతంలో తాను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నపుడు దివంగత సీఎం, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలుండేవని చెప్పారు. వైయస్‌కు కూడ తమ తండ్రి జలగం వెంగళరావు పట్ల గౌరవం ఉండేదని వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో యంత్రాంగం మొత్తం పడకేసిందని, పరిపాలన కుంటుపడిందన్నారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే అది జగన్మోహన్‌రెడ్డి వల్లే సాధ్యం అవుతుందన్నారు.
సంకినేని వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావు విజయమ్మతో సమావేశమైనప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి గౌతం, బి.జనక్‌ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, ఖమ్మం జిల్లా పార్టీ పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి కూడా ఉన్నారు.