అసెంబ్లీలో వైయస్ఆర్ సీపీ నిరసన

 

హైదరాబాద్ : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభలో వినూత్నంగా నిరసన తెలిపారు. వారు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదని వారు స్పష్టంచేశారు.
అసెంబ్లీ ప్రారంభం, గంట వాయిదా
శాసనసభ సమావేశాల చివర రోజు కూడా అదే వరుస. శనివారం ఉదయం విపక్షాల నిరసన మధ్యే అసెంబ్లీ సమావేశాలు మొదలైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు తీర్మానాలపై చర్చించాల్సిందేనంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. నినాదాలతో హోరెత్తించారు. చివరి రోజయినా సమావేశాలను సజావుగా నిర్వహిద్దామన్న స్పీకర్ విజ్ఙప్తిని సభ్యులు పట్టించుకోలేదు.  తమ పట్టువీడలేదు. మరోవైపు శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బీఏసీ సమావేశాలకు అనుగుణంగానే సభ నడుస్తోందనీ, అయినా విపక్షాలు సమావేశాలకు సహకరించకపోవటం దురదృష్టకరమనీ వ్యాఖ్యానించారు. పరిస్థితిలో మార్పు లేకపోవటంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొదటి నాలుగు రోజులూ సమావేశాలు వాయిదాలతోనే ముగిసిపోగా ఈ రోజు చివరి రోజు. నేడు అసెంబ్లీలో సీజనల్ వ్యాధులు, గిరిజనుల సమస్యలు, మందుల కొరతపై వైఎస్ఆర్ సీపీ, వర్షాభావ పరిస్థితులు, కరువు, ఎరువుల కొరతపై టీడీపీ, తెలంగాణ తీర్మానంపై టీఆర్ఎస్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ప్రణాళిక అమలుపై బీజేపీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై వామపక్షాలు, కానిస్టేబుళ్ల నియామకాల భర్తీపై ఎంఐఎం పార్టీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.

Back to Top