ఆర్టికల్-3‌ను సవరించాలి, చర్చించాలి

న్యూఢిల్లీ, 12 డిసెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ‌ గురువారంనాడు లోక్‌సభలో రెండు తీర్మానాలను  ఇచ్చింది. కేంద్రానికి అపరిమిత అధికారాలను ఇస్తున్న ఆర్టికల్‌-3ని సవరించాలని, దీనిపై చర్చ జరగాలని కోరింది. అలాగే అవిశ్వాసంపై చర్చ జరగాలని పార్టీ తీర్మానాన్ని ఇచ్చింది.

ఓట్లు, సీట్ల కోసం తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోడానికే ఈ ప్రయత్నాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలకు కలిసి మద్దతు కూడగడుతున్నారు.

అవిశ్వాస తీర్మానంపై అడుగు ముందుకు పడకుండానే లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సహ, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని స్పీకర్ మీరాకుమా‌ర్ ‌గురువారం కూడా సభలో ప్రకటించారు.

ఈ తీర్మానాలపై చర్చ జరగాలంటే ముందు సభ సజావుగా ఉండాలని, సభ్యులంతా వారి వారి స్థానాలకు వెళ్లి కూర్చొవాలని స్పీకర్‌ మీరాకుమార్ పదే పదే విజ్ఞప్తి చేశారు. పోడియంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ సభ్యులు మాత్రం ఆందోళన కొనసాగించారు. అవిశ్వాసంపై చర్చించేందుకు 50 మంది సభ్యుల్ని లెక్కించాల్సి ఉంటుందని పదే పదే చెప్పిన స్పీక‌ర్‌ చివరికి గందరగోళం మధ్య సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

Back to Top