సీమాంధ్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రం త్వరగా విభజించాలని కోరుతూ.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం అన్యాయం, దురదృష్టకరం  అని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర అంతా ఆందోళనలతో రగిలిపోతుంటే చంద్రబాబు వ్యవహార సరళి ఆ ప్రాంత ప్రజలకు ద్రోహం చేయడమేనని నిప్పులు చెరిగారు. ఒక పక్కన రాష్ట్ర విభజనకు నిరసనగాను, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మారిపోతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు దేనికి భయపడి తన నీడలాంటి సిఎం రమేష్‌ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటికి కాళ్లబేరానికి పంపారని అంబటి నిలదీశారు. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని అమలు చేయడానికి సహకరిస్తామని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ‘అలాంటి చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని మమ్మల్ని అంటారా?’ అని అంబటి మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టినందుకు అన్యాయంగా, అక్రమంగా 16 నెలలు జైలులో ఉండి, ఎన్నో కష్టాలు పడిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు వచ్చిన తరువాత కూడా రాష్ట్ర ప్రజానీకం కష్టాల కన్నా తన కష్టాలు ఎక్కువ కాదనే భావనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నారని ఆయన అన్నారు. ‘అలాంటి శ్రీ జగన్ కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారా? ‌సిడబ్ల్యుసి నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆత్ర పడుతున్న చంద్రబాబు కుమ్మక్కయ్యారా?’ అని ప్రశ్నించారు. బాబు చెప్పే బుర్రకథలు, హరికథలు వినడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

తెలంగాణ, సీమాంధ్ర నాయకులిద్దరినీ వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి, విభజన త్వరితగతిన కావాలని, శ్రీ జగన్‌కు బెయిల్ రాకూడదని రాష్ట్రపతితో సహా ఎం‌దరో నాయకులకు చెప్పిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారా, లేక శ్రీ జగన్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. ‘‌టిడిపి నాయకులు నామా నాగేశ్వరరావు, ఎరబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి లాంటి నాయకులంతా తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయిందని కేకులు కట్ చేసుకుని ఓ వైపు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి రాష్ట్ర విభజన త్వరగా జరగాలని దీక్ష చేయడం తెలుగు జాతికి ద్రోహం చేయడం కాదా?’ అని ప్రశ్నించారు. సీమాంధ్రలో పుట్టి, ఇక్కడే పెరిగి, సీమాంధ్రుల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే, ‌సిఎం అయిన బాబు, సీమాంధ్ర రోదనలను పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేయడం దారుణం అనీ, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అంబటి హెచ్చరించారు.

Back to Top