ఆ 'కుర్చీ'లో కొనసాగే అధికారం లేదు!


సి.బెళగల్

18 నవంబర్ 2012 : ప్రజల కోసం పని చేసే సమర్థత లేకపోతే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అధికారం కిరణ్ కుమార్ రెడ్డికి లేదని షర్మిల అన్నారు. 32 వ రోజు 'మరో ప్రజాప్రస్థానం'  పాదయాత్రలో భాగంగా షర్మిల ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ సభలో ప్రసంగించారు. కనీసం వైయస్ పథకాలను సరిగా అమలు చేసినా చాలుననీ, అది కూడా చేయలేకపోతే ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదని ఆమె వ్యాఖ్యానించారు.
"కరెంటు ఇచ్చేది రెండు మూడు గంటలు మాత్రమే. కానీ బిల్లులు మాత్రం వందల్లో వస్తున్నాయి. మీకు కరెంటుతో ఏం పని? కిటికీలు, తలుపులు తెరుచుకుని పడుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయనగారు మటుకు ఏసీలోనే ఉంటారట! ఆయన ఆఫీసులో, ఇళ్లలో ఏసీలుంటాయట. మనం మటుకు కిటికీలు, తలుపులు తెరుచుకోవాలట. ఇదీ ఆయన బాధ్యతారహితంగా ఇచ్చే సలహా. కొత్త పరిశ్రమల మాట అలా వుంచి కరెంటు లేక ఉన్న పరిశ్రమలు కూడా మూతబడి ఉద్యోగాలు పోయి ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిగారూ! మీరు కొత్త పథకాలు ఏమీ ప్రవేశపెట్టనక్కర లేదు. కేవలం రాజన్న చేసిన పని చేయగలిగితే ఆ కుర్చీలో కూర్చోండి! ఆ పని చేసే సమర్థత లేకపోతే మీకు ఆ కుర్చీలో కూర్చునే అధికారం  కూడా లేదని చెపుతున్నాం" అని షర్మిల అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు తన హయాంలో ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదనీ, రాజశేఖర్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక వారికి నష్టపరిహారం ఇచ్చారనీ ఆమె గుర్తు చేశారు. రాజన్నకున్న పెద్ద మనసు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులకు లేదని ఆమె విమర్శించారు.

"వారిద్దరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డిగారితో పోటీ పడలేమని. రాజశేఖర్ రెడ్డిగారు కొడుకుతోనూ పోటీ పడలేమని కూడా తెలుసు. కేవలం మీ పక్షాన నిలిచాడనీ, మీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనీ ఆధారాల్లేకపోయినా విచారణ పేరుతో బెయిలు కూడా రానివ్వకుండా కుమ్మక్కై జైలు పాలు చేశారు. జగనన్న బయట ఉంటే వాళ్లకి మనుగడ ఉండదని, కుట్కలు పన్ని కేవలం వారికి అధికారం ఉందని సిబిఐని వాడుకుని అధికారపక్షం, తెలుగుదేశం కలిసి కుమ్మక్కై జగనన్నను జైల్లో పెట్టారు. కానీ దేవుని ఆశీర్వాదం జగనన్నకు ఉంది." అని షర్మిల అన్నారు.
"చంద్రబాబు పాదయాత్రకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రభుత్వాన్ని వెంటనే దించేస్తామని, అవిశ్వాసం పెడతామనీ ఒక్క మాటంటే ఒక్క మాట చెప్పమంటే కూడా ఈ రోజు వరకూ నోరు విప్పరు" అని షర్మిల దుయ్యబట్టారు. కానీ దేవుడు ఈ నీచమైన కుట్రలను, మనుష్యులను చూస్తున్నాడనీ, ఎన్ని కుట్రలు పన్నినా జగనన్నను దేవుడే బయటకు తీసుకువస్తాడనీ ఆమె అన్నారు.
"ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటకు వచ్చి 'రాజన్న రాజ్యం' దిశగా మనల్ని నడిపిస్తాడు. మీరు సమయం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించినరోజున రాజన్నరాజ్యమూ వస్తుంది. జగనన్న రాజన్న మాటలను నెరవేరుస్తాడు. కోటి ఎకరాలకు నీరందిస్తాడు. రైతులకు ప్రత్యేకమైన బడ్జెట్ వస్తుంది. మూడువేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు వస్తాడు. మన వృద్ధులకు, వితంతువులకు ఏడువందల రూపాయల పెన్షన్ వస్తుంది. వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ వస్తుంది. పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి పథకం వస్తుంది.ఆ సువర్ణయుగం మళ్లీ రావాలంటే జగనన్నను మీరు ఆశీర్వదించాలి"అని షర్మిల ప్రజలను కోరారు.
ఈ ప్రాంతానికి (సి.బెళగల్) సంబంధించి నీటికి ఎద్దడి ఉందనీ, దీని కోసం వైయస్ హయాంలో రూ.150 కోట్లు కేటాయించారనీ, ఆ ఎల్ఎల్‌సి ఆధునికీకరణ పనులను పూర్తి చేసి ఉంటే నీటి సమస్య పరిష్కారం అయివుండేదనీ ఆమె అన్నారు. జగనన్న సిఎం అయ్యాక ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తారని ఆమె హామీ ఇచ్చారు.

Back to Top