ప్రధాని, జీఓఎంకు 8,067 ఈ-మెయిళ్లు

హైదరాబాద్ :

ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కోరుతూ నవంబర్ 1వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున 8,067 ఈ-మెయిళ్లను ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రుల బృందానికి (జీఓఎం) పంపామని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో‌ ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, సభ్యుడు‌ డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారంనాడు వారు మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ పిలుపు మేరకు ఇప్పటి వరకు 8,067 గ్రామ పంచాయతీలు ఈ మేరకు తీర్మానాలు చేసి పంపాయని తెలిపారు.

మైసూరారెడ్డి మాట్లాడుతూ.. సమైక్య తీర్మానాలు చేసిన గ్రామాలు ఇంకా ఎక్కువే ఉన్నాయని, ఈ-మెయిల్ ‌సౌకర్యం లేనందున తమకు పూర్తి సమాచారం రాలేదని చెప్పారు. ఈ నెల 7న జీఓఎం సమావేశమవుతున్నందుకు నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును ఆయన మరోసారి గుర్తు చేశారు. కేంద్రానికి ఈ-మెయిళ్లు పంపడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులుగా.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రభుత్వమైతే తప్పక స్పందిస్తుందని మైసూరా వివరించారు.

శ్రీమతి విజయమ్మను ప్రతిఘటించమని ప్రభుత్వమే ప్రేరేపించింది :

నల్లగొండ జిల్లాలో వరద బాధితులను పరామర్శించకుండా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను ప్రతిఘటించడం వెనుక రాష్ట్ర‌ ప్రభుత్వమే ఉందని, మంత్రులు ప్రేరేపించడంతోనే ఇలా జరిగిందని కొణతాల దుయ్యబట్టారు. మంత్రులుగా ఉన్నవారే అడ్డుకోవాలని పిలుపునివ్వడం చాలా తప్పన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి పలుకుబడి క్షీణిస్తుంటే మాత్రం ఇలా చేయాలా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇద్దరూ వరద ప్రాంతాలను సందర్శించి రాజకీయాలు మాట్లాడారని కొణతాల అన్నారు. కానీ శ్రీమతి విజయమ్మ తన పర్యటనలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని, అయినా ప్రభుత్వమే కావాలని అడ్డుకున్నదని కొణతాల విమర్శించారు. చంద్రబాబుకు మాత్రం పోలీసులు, మంత్రులే ఘన స్వాగతం పలికారన్నారు. శ్రీమతి విజయమ్మ పర్యటన ఖమ్మం జిల్లాలో విజయవంతంగా, ప్రశాంతంగా జరిగిందని, అందుకే నల్లగొండలో కావాలని అడ్డుకున్నారని చెప్పారు. ఇలాంటి అడ్డంకుల వల్ల తమ పర్యటనలు ఆగిపోవని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన కచ్చితంగా తెలిపారు.

Back to Top