గుంటూరు: తెనాలి పట్టణ వైయస్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు మంజరి చౌదరిని అరెస్ట్ చేసేందుకు మాచవరం పోలీసులు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మంజరి చౌదరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ చర్యకు ప్రయత్నించినట్లు సమాచారం. స్థానిక పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు మాచవరం పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసేందుకు ఎలా వస్తారని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించారు. మంజరి చౌదరి ఇంటి వద్దకు పోలీసులు రావడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా పోస్టు విషయంలో కేసు నమోదు చేసి, అర్ధరాత్రి అరెస్ట్‌కు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.