వైయస్ఆర్ జిల్లా: డీఎస్సీ పరీక్షల లీకేజీ ఆరోపణలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డీఎస్సీ-2025 నిర్వహణలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, మధ్యవర్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి, పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.