మ‌హాభ‌జ‌న‌! మ‌హాభోజ‌నం!!

తిరుప‌తి మ‌హానాడు వీడియో తీసిన‌వాడి ఉద్దేశ‌మేమిటో గానీ చంద్ర‌బాబు మాట్లాడుతుండ‌గా ప‌దేప‌దే ఎన్టీఆర్ మొహం మీద నుంచి బాబును ఫోక‌స్ చేశాడు. అది కూడా ఎన్టీఆర్ మొహం మాత్ర‌మే ఉన్న ప‌సుపు విగ్ర‌హం. ఎన్టీఆర్ మొహం స్ప‌ష్టంగా ఉన్న‌ప్పుడు బాబు అవుట్ ఆఫ్ ఫోక‌స్‌లో ఉంటాడు. బాబు ఫోక‌స్‌లో ఉన్న‌ప్పుడు బై దేఫాల్ట్ ఎన్టీఆర్ దృశ్యం అస్ప‌ష్ట‌మ‌య్యింది. ఇది సాంకేతిక లోప‌మో, లేక చాలా ఖ‌ర్చు పెట్టి అత్యాధునిక కెమెరాలు రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్‌లో వాడిన‌ట్లు ప్ర‌త్యేకంగా వాడితే వ‌చ్చిన ఎఫెక్టో తేలీదు. ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఏవేవో ప్ర‌శ్న‌లు, పైకి చెప్పుకోలేని బాధ‌ల‌కు ప్ర‌తి రూపాలు క‌ళ్ల‌ముందే క‌దిలేలా చేయ‌డంలో ఆ వీడియోగ్రాఫ‌రు నూటికి నూరు పాళ్లు కృత‌కృత్యుడయ్యాడు. 

నిజానికి మ‌హానాడులో నాయ‌కుల‌తో పాటు, కార్య‌క‌ర్త‌లు కూడా క‌డుపునిండా తిని, కంటినిండా నిద్ర‌పోయి ఉండ‌వ‌చ్చు గానీ, జ‌న‌మైతే ఉన్నారు. బాబు మాట్లాడుతుండ‌గా వెన‌క నుంచి కెమెరా పెట్టి ప‌దేప‌దే ఆయ‌న వెన్ను చూప‌డంలో కూడా వీడియోగ్రాఫ‌రు త‌న ప్ర‌తిభ‌నంతా ఉప‌యోగించాడు. మ‌రి బాబు మాట్లాడుతున్న‌ప్పుడు వేదిక మీద అతిర‌థమ‌హార‌థుల‌తో పాటు అంద‌రూ గుర్రుపెట్టి నిద్ర పోతున్న‌ప్పుడు వీడియోగ్రాఫ‌రు మాత్రం ఏం చేస్తాడు? వెన్నుమాత్ర‌మే చూపగ‌లిగాడు. 

కార్తీక వ‌న‌భోజ‌నాలు, స్కూలు, కాలేజీ, పిల్ల‌ల విహార యాత్ర‌లు మామూలే. మ‌హానాడు వంటావార్పు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మాయ‌బ‌జార్‌లో క‌నిపించే కుంభాల‌కు కుంభాల పిండివంట‌లు, లేహ్యాలు, చేష్యాలు, పానీయాలు, క‌ల‌గ‌లుపుల‌కు ఒడియాలు, అప్ప‌డాలు - చివ‌ర తాంబూలాలు. 

అష్ట‌క‌ష్టాల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ద‌శ‌దిశ సంగ‌తి దేవుడెరుగు. వ‌చ్చామా, కూర్చున్నామా, తిన్నామా, కొండ చూసి వ‌చ్చామా అన్న‌ట్లు మ‌హానాడు పూర్త‌యింది. అయితే 66 ఏళ్ల బాబు 2050 వ‌ర‌కు మాత్ర‌మే టీడీపీ అధికారంలో ఉంటుంద‌ని చెప్ప‌డం మ‌హానాడు భోజ‌నాల‌కు వ‌చ్చిన వారికెవ‌రికీ రుచించ‌లేద‌ట‌. ప‌క్క‌న తెలంగాణ సీఎం కొడుకు కేటీఆర్‌తో అన్నిట్లో పోల్చుకునే ఏపీ సీఎం కొడుకు ట్విట‌ర్‌బాబు డోస్ పెంచి అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఆధారాలు చూపితే స్వ‌యంగా జైలుకెళ్లి కూర్చుంటాన‌న‌డం మాత్రం భోజ‌నాల‌కు వ‌చ్చిన వారికి తెగ‌న‌చ్చింద‌ట‌. వారి అభీష్ఠానికి అనుగుణంగా మ‌రుస‌టి రోజు మీడియాలో ఆ వార్త స‌ముచిత ప్రాధాన్యంతోనే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. 
Back to Top