చంద్రబాబు పది తలలు

రావణాసురిడికి పది తలలు ఉంటాయి. చంద్రబాబుకు అలాంటి తలలు బోలెడున్నాయి.
బాబు చెప్పినదే చెప్పేవాళ్లు...బాబు చెప్పినట్టే నడిచేవాళ్లు..బాబు చెప్పినప్పుడు చేసేవాళ్లు...బాబు చెప్పనప్పుడు చేయనివాళ్లు...బాబు చెప్పినవి తప్ప చేయనివాళ్లు..బాబుకోసమే పని చేసేవాళ్లు..ఇలా రకరకాల తలలున్నాయి...అవసరానికి ఆ తలలు బైటికొస్తుంటాయి. ప్రతిపక్షాలో, ప్రజలో ఆ తలను తెగ్గొట్టినప్పుడు ఇంకో తల మొలుస్తూ ఉంటుంది. 
అవేమిటో చూడండి...
మీడియా తలకాయలు  పచ్చపత్రికలు, పచ్చ ఛానెళ్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9, టివి5, ఎన్టీవీ, ఎబిఎన్, హెచ్ ఎమ్ టివీ ఇంకా కొన్ని ఛానెళ్లు అన్నీ కలిసి బాబు భజన చేయడం తప్ప మరోపని చేయవు. బాబును పల్లకిలో మోసే ఈ తలకాయలే వాస్తవాలను దాచి, ప్రజల ముందు చంద్రబాబును మహానాయకుడిగా నమ్మించేందుకు, టిడిపి ప్రభుత్వ అవినీతిని దాచిపెట్టేందుకు పనిచేస్తున్నాయి. 
కుల తలకాయలు  పవన్ కళ్యాణ్, ముద్రగడ
చంద్రబాబు మరో ముఖం పవన్. 2014 ఎన్నికల్లో ఈ తలను విపరీతంగా వాడుకున్నాడు బాబు. నా ముఖం చూసి చంద్రబాబుకు ఓటేయండి...ఆయన అనుభవం ఉన్న నాయకుడు...నాదీ పూచీ అని పవన్ తో అనిపించాడు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినా, కాపు నాయకుడికి గాలం వేసి మరో కులవాద తలకాయిని తగిలించుకున్నాడు. బాబు కష్టకాలంలో ఆదుకునేందుకు అప్పుడప్పుడూ వచ్చి ఆదుకునే, అడ్డుకట్ట వేసుకునే ముఖాలే ఇవి. 
అధికార తలకాయలు జెడి లక్ష్మీనారాయణ, అశోక్ బాబు
వైఎస్ జగన్ తో నేరుగా తలపడే ధైర్యం లేక కాంగ్రెస్ తో కుమ్మక్కయ్ బాబు చేసిన నీచ రాజకీయాల కోసం వాడుకున్న తలకాయ పేరే జెడి లక్ష్మీనారాయణ. దర్యాప్తు సంస్థలను కూడా మేనేజ్ చేసుకునే బాబూ మేనేజ్మెంట్ కు ఈ తలకాయే ఉదాహరణ. బాబు చెప్పినట్టే దర్యాప్తు చేసిన జెడి, దర్యాప్తు వివరాలను పచ్చ పత్రికలకు అందిస్తూ పట్టుబడ్డా కూడా ఆ అధికారిపై చర్యలు లేవంటే అందుకు కారణం ఎవరో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడాముఖం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలి, పబ్లిక్ గా చంద్రబాబు కోసం పనిచేస్తోంది. 
పొత్తు తలకాయలు  కాంగ్రెస్, బిజెపి
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని వెన్నుపోటుతో వశం చేసుకున్న చంద్రబాబు మామ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రంతో కుమ్మక్కు రాజకీయాలే నడుపుతున్నాడు. వైఎస్ జగన్ పై కేసుల వ్యవహారంలోనే కాదు, అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ తో లాలూచీలు బాబుకు మామూలే. అయినా ఒకప్పటి ఆ గూటి పక్షి చంద్రబాబు కనుక, బాబు ముఖాల్లో కాంగ్రెస్ కూడా ఒకటని వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్నాడు బాబు. బిజెపిని చంద్రబాబు వాడినంతగా దేశ ప్రజలు కూడా వాడుకుని ఉండరు. అప్పట్లో వాజ్ పేయ్, ఇప్పుడు మోదీ ఇద్దరూ బాబు అధికార కాంక్షకు ఊతమిచ్చి, గెలిచేందుకు అవకాశం ఇచ్చి, పొత్తుతో రాజకీయ మనుగడనిచ్చి ఆదుకున్నారు. మోదీ ప్రభంజనాన్ని, బిజెపి ముఖాన్ని అడ్డుపెట్టుకునే చంద్రబాబు 2014 గట్టెక్కేశాడు.  
తోలుబొమ్మ తలకాయలు  జూనియర్ ఎన్టీఆర్, శివాజీ
చంద్రబాబు ప్రచారానికి పనికొచ్చిన తలకాయిలే జూనియర్, శివాజీ. సొంత కుటుంబం వాడైన జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల్లో తురుఫు ముక్కలా ప్రచారంలో వాడుకుని తర్వాత పక్కన పడేశాడు చంద్రబాబు. చిన్నసైజు జోకర్ ఫేస్ గా శివాజీ ఉపయోగించుకున్నాడు. నాటకం రక్తి కట్టడానికి ట్విస్టనిచ్చే కారెక్టర్ల ముఖాల్లా వీరిద్దరూ బాబుకు ఉపయోగపడ్డారు. 

మొత్తానికి రావణుడికంటే భారీ తలకాయలతో రాక్షస రాజ్యాన్ని నడుపుతున్న చంద్రబాబు పాలనకు చివరిదశ ఆరంభమైందనే అనుకోవాలి. ఎందుకంటే పాపం పండే కాలం, నాయకుల నయవంచనలకు తెరదించే కాలం ముందుంది. రాబోయే ఎన్నికల రణస్థలిలో రావణుని తలకాయలతో పాటు రావణవిరమణ కూడా ఏకకాలంలో జరుగుతుందంటున్నారు తెలుగు ప్రజలు. ఎందుకంటే ఓటర్లే ఎన్నికల యుద్ధంలో అసలైన ఆయుధాలు కదా!!   
Back to Top