నిజం చెప్పని బాబు

నీళ్లలోంచి నిప్పుని పుట్టించొచ్చు కానీ, చంద్రబాబు నోట్లోంచి నిజాన్ని చెప్పించలేం. 

టెన్త్ పేపర్ లీకైందా లేదా?-ఈ ప్రశ్నని అడగండి
టెన్ అంటే వన్ పక్కన జీరో వుండాలి. నా చిన్నప్పుడు నారావారిపల్లెలో చదువుకున్నాను. తరువాత రంగంపేట హై స్కూల్ లో చదువుకున్నా. మా స్కూళ్లో నేలమీద కూర్చునేవాళ్లం. రంగంపేటలో బెంచీలుండేవి-ఇలా వుంటుంది జవాబు.
చంద్రబాబు గారూ..మేమడిగింది మీ బాల్యం, విద్యాభ్యాసం కాదు, టెన్త్ పేపర్ లీకైందా లేదా?
లీక్ అనే మాటని మీరు పదే పదే వాడుతున్నారు. అసలీ పదం లాటిన్ నుంచి పుట్టింది. కావాలంటే డిక్షనరీ చూడండి. ఒకప్పుడు ఉభయరాష్ట్రాల్లో కుళాయిల్లోంచి నీళ్లు ఎక్కువగా లీక్ అయ్యేవి. నేను సీఎం అయ్యాక లీకేజీలు తగ్గించాను. ఆ రకంగా ముందరకి పోయాను. మీరు టెన్త్ పేపర్ అంటున్నారు. ఒకప్పుడు అన్ని క్లాసులకి పబ్లిక్ ఎగ్జామ్స్ వుండేవి. మీకు తెలుసో తెలియదో ఆ తరువాత బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని క్లాసులు పాస్ చేసి టెన్త్ దగ్గర స్పీడ్ బ్రేకర్ పెట్టారు. చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి. నేను సీఎం అయ్యాక జంబ్లింగ్ పెట్టాను. నేను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ చదివాను. మీరేం చదివారో నాకు తెలియదు
అయ్యా మాక్కావల్సింది చరిత్ర కాదు, వాస్తవం. టెన్త్ పేపర్ మీ మంత్రి నారాయణ స్కూల్లో లీకైందా లేదా..?
ప్రతి దానికి నారాయణ పేరుని జోడిస్తున్నారు. నారాయణ అంటే ఎవరు, శ్రీమహా విష్ణువు ప్రతిరూపం. నేను చిన్నప్పుడు తిరుపతి కొండకి నడిచివెళ్లే వాన్ని. అక్కడ దైవదర్శనం చేసుకొని మళ్లీ నడిచి ఇల్లు చేరేవాన్ని. నడక వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు టెన్త్ టెన్త్ అంటున్నారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్  గురించి ఫిఫ్త్ క్లాస్ లోనే ఆలోచించేవాన్ని . టెన్త్ పరీక్షలైపోయిన తరువాత తిరుపతి వివి. మహల్ లో సినిమా చూసాను. వాస్తవానికి ఆ రోజు సినిమాల్లో ఒక నీతి వుండేది
ఏం మాట్లాడుతున్నారు సార్, పదోతరగతి పరీక్ష పేపర్ గురించి అడుగుతున్నాం మేం
చూడండి, ప్రతి దానికి రాద్ధాంతం చేయకండి. జీవితమంటేనే పరీక్ష. పరీక్షలకి భయపడితే జీవితాన్ని పాస్ కాలేరు. నువ్వెలా గెలిచామన్నది ముఖ్యం కాదు, గెలవడమే ముఖ్యం. పదోతరగతిలో కాపీ కొట్టడం ఈనాటి సమస్య కాదు. కాపీ అనేది మన జన్మహక్కు. పాటలు, సినిమాలు, కథలు, నవలలు అన్నీ కాపీకొడతారు. ఎన్టీఆర్ పాలసీలను నేను కాపీ
కొట్టాను. దీనికంత కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతారేం. ఆధారాలుంటే చూపండి.
ఆధారాలిస్తే సీబీఐతో విచారణ జరిపిస్తారా?
ఆధారం అంటే అదేం ఆధార్ కార్డు కాదు. ఎవిడెన్స్, సాక్ష్యం. ఆధారంలో దారం వున్నంతమాత్రాన దాంతో బట్టనేయలేం. వాస్తవం తెలియాలంటే ఎవిడెన్స్ సరిపోదు. సరైన గైడెన్స్ వుండాలి. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంది. అందుకే మంచినీళ్లని శుద్ధి చేసి ఇస్తున్నాం. 
ఈరకంగా మాట్లాడే ముఖ్యమంత్రితో నిజాలు పలికించగలమా సార్...?
Back to Top