మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది

రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం

కష్టం వచ్చినప్పుడు నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి

రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం

వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటా నెరవేర్చాం

సాకులు వెతుక్కోకుండా మేనిఫెస్టోను అమలు చేశాం

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌కు ముందే సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేశాం

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాల‌ని మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేద‌ని స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 

వార్షిక బడ్జెట్‌ లేకుండానే..:
    అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా చంద్రబాబునాయుడు వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారు. దేశచరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం రెగ్యులర్‌ బడ్జెట్‌ ఇప్పటికీ పెట్టలేదు. ఇంకా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నడుస్తోంది. రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే ఏయే స్కీంకు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు చంద్రబాబును తిడతారని భయపడి ఏకంగా బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. 

సంక్షేమ క్యాలెండర్‌ తప్పలేదు:
    మన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం. రాజకీయాల్లో మేనిఫెస్టో అన్నదానికి ఒక నిర్వచనం ఇచ్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నామని చెప్పి.. తొలి రోజు నుంచి ఎలాంటి సాకులు వెతుక్కోకుండా.. రెండేళ్లు కోవిడ్‌ లాంటి సమస్యలను ఎదుర్కొన్నా.. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా.. ఎక్కడా ప్రజలకు చేయాల్సిన పనుల్లో వెనక్కి తగ్గలేదు. కారణాలు చెప్పాల్సి వస్తే.. మన ప్రభుత్వంలో వచ్చిన కష్టాలు ఎక్కడా, ఎవ్వరూ చూసి ఉండరు. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఇన్ని కష్టాలున్నప్పుడు, ఆ కారణాలు చెప్పొచ్చు కదా? అన్నారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మేనిఫెస్టోను అమలు చేయొచ్చు అని కూడా చెప్పారు. 
    అయితే మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోను ఇచ్చాం. ప్రజలు మనకు ఓటేశారు. మనం ప్రజలకిచ్చిన మాట మరో ముప్పై ఏళ్ల పాటు మన బాటను నిర్దేశిస్తుంది. ఎన్ని కష్టాలున్నా ప్రజలకు చిక్కటి చిరునవ్వు చూపించి.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ నెరవేర్చాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్‌ కన్నా ముందు ప్రతి పథకంపై క్యాలెండర్‌ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ముందే చెప్పాం. చెప్పినట్లుగా ఆ నెలలో బటన్‌ నొక్కి నేరుగా డబ్బులు విడుదల చేయడం.. బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండదు. మనం ఎప్పుడూ తలెత్తుకునే రాజకీయాలు చేశాం. ఇకపై కూడా అలాంటి రాజకీయాలే చేస్తాం.

అబద్ధాల్లో అస్సలు పోటీ పడలేదు:
    ఐదేళ్ల పరిపాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బ్రతికే ఉంది. ‘జగన్‌ మంచే చేశాడు. చెడు చేయలేదు’ అన్న మాటే ప్రతి చోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో మనం అస్సలు పోటీ పడలేదు.
     ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చంద్రబాబులా జగన్‌ కూడా హామీలు ఇవ్వాలన్నట్లు చాలా మంది ఆశించారు. పిల్లలు కనిపిస్తే చంద్రబాబులా.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. చెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని జగన్‌ కూడా చెబుతాడని ఆశించారు. మెడలో కండువాలతో రైతులు కనిపిస్తే నీకు రూ.20 వేలు అని జగన్‌ చెప్తాడని ఆశించారు. కానీ జగన్‌ చెప్పలేకపోయాడు.

తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం:
    ఒకవేళ జగన్‌ అవే మాటలు చెప్పి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లమేమో. కాని, ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్‌ కూడా ప్రవేశ పెట్టలేని పరిస్థితి ఉంది. ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చని పరిస్థితి కనిపిస్తోంది. నేను కూడా అదే మాదిరిగా చేసి ఉంటే.. మీలో ఏ ఒక్కరైనా తలెత్తుకుని మీ గ్రామాల్లోకి వెళ్లినప్పుడు మా జగన్‌ ఇది చెప్పాడు. కానీ, మా ప్రభుత్వంలో ఇది చేయలేకపోతున్నామనే మాట.. ప్రజలు మిమ్నల్ని ఎదురు ప్రశ్నిస్తే,   మీరు తట్టుకునే వారా? అని అడుగుతున్నాను. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా అలాంటి రాజకీయాలే చేస్తాం. 

రాజకీయాల్లో ఇది ముఖ్యం:
    రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయి. వేధింపులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు తోడుగా ఉండాలి. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా న్యాయపరమైన సహాయం చేయడంతో పాటు, ప్రభుత్వ అన్యాయాలు ప్రశ్నించాలి. 
    రాజకీయాల్లోనూ చీకటి తర్వాత పగలు వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించామన్నది రాజకీయాల్లో మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కష్టకాలంలోనే ఒక మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది. కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి గట్టిగా నిలబడగలిగితే తనకు దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి. అప్పుడే తను ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఇది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన అంశం.

ప్రజలు తేడా గమనించారు:
    వైయస్సార్‌సీపీ పాలన, టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందన్నది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన అబద్దాలు మోసాలవుతాయి. మోసాల నుంచి ప్రజలకు రోజురోజుకూ ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి.
    జగన్‌ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదు కదా.. చివరకు ఉన్న పలావు పోయింది. ప్రతి ఒక్కరూ సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. చదువులు పూర్తిగా దెబ్బ తిన్నాయి. విద్యాదీవెన, వసతి దీవెన పోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా అందని పరిస్థితి. ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కాయి. టోఫెల్‌ గాలికెగిరి పోయింది. రోజుకొక మెనూతో అమలయ్యే గోరుముద్ద కార్యక్రమాన్ని కూడా నీరు గార్చారు. విద్యా రంగంలో మూడు క్వార్టర్లు గడిచిపోయినా ఫీజుల్లేవు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు.
    వైద్య రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2 వేల కోట్లకు పైగా పెండింగ్‌ కాగా ఆరోగ్య ఆసరా అటకెక్కింది. ప్రభుత్వ రంగంలో కడతామన్న 17 మెడికల్‌ కాలేజీల్లో 5, మన హయాంలో వచ్చాయి. మరో 5 కాలేజీలకు సీట్లు వస్తే వద్దన్నారు. కడుతున్న కాలేజీల నిర్మాణం ఆపేశారు. అవి కూడా అమ్మేస్తామంటున్నారు. 104, 108 ఉద్యోగులుకు చంద్రబాబు వచ్చిన తర్వాత జీతాల్లేవు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ (గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌), డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రమాణాలతో మందులు సరఫరా చేస్తే.. ఇప్పుడు అవి ఏమయ్యాయో తెలియదు. స్పెషలిస్టు డాక్టర్ల కొరత లేకుండా మనం చేస్తే.. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. 
    వ్వయసాయ రంగంలో పెట్టుబడి సాయం దేవుడెరుగు.. ఉచిత ఇన్సూరెన్స్‌ లేదు. ఆర్బీకేలు అటకెక్కాయి. ఇ–క్రాప్‌ కూడా సక్రమంగా చేయలేదు. మన హయాంలో పథకాలు డోర్‌ డెలివరీ జరిగితే.. ఇవాళ అది కూడా గాలికెగిరిపోయింది. ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అక్కడ నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు అక్కడకి పోవాలి. రెండు నెలలు అక్కడికి వెళ్లకపోతే పథకాలు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల పెన్షన్లు నిలిపివేశారు. ప్రతి అడుగులోనూ ఇదే జరుగుతోంది.

అంతులేని అవినీతి:
    ఇక ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడాల్సిన పని లేదు. పేరుకు ఉచిత ఇసుక అన్నారు. కానీ వైయస్సార్సీపీ హయాంలో కన్నా ఇసుక ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, మనం అమ్మిన రేటు కన్నా అధిక ధరకు అమ్ముతున్నారు. స్టాక్‌ పాయింట్లలో ఇసుక కనపడకుండా మాయం అయిపోతుంది. 
    మద్యం పరిస్థితి కూడా అంతే. ప్రజలు బాగు పడాలని వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వినియోగం తగ్గాలని మనం తాపత్రయ పడ్డాం. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్‌ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. 120 రూపాయల మద్యం క్వాలిటీ బాగుంటుందా?. లేక 99 రూపాయల మద్యం బాగుంటుందా?. రూ.99కే మద్యం సరఫరా చేసి, అమ్మకాలు పెంచుతామంటున్నారు. అలా అమ్మకాలు పెంచితే డిస్టిలరీస్‌.. చంద్రబాబుకు డబ్బులిస్తాయి. ప్రతి దాంట్లోనూ స్కామే. అధికార పార్టీ నేతలకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపుల నుంచి ఎమ్మెల్యేలకు వాటాలు సరేసరి. ఇక  ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు వస్తున్నాయి. 
    రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ క్లబ్బులు కనిపిస్తున్నాయి. మట్కా  వంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, రివర్స్‌లో వారి మీదే దొంగ కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారి పోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది.

వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే:
    మనం ప్రజల తరపున మనం ఉద్యమించాలి. ప్రజల కష్టాల్లో మనం భాగస్వామ్యులం కావాలి. కేసుల పెడతారని భయపడొద్దు. కేసులు పెడితే ఏమవుతుంది. నన్ను 16 నెలలు జైలుకు పంపించారు. నన్ను వేధించినట్టుగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మరలా బయటకు వచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాం. ముఖ్యమంత్రి అయ్యాను. కేసులు పెట్టడం మినహా ఇంతకన్నా ఏం చేయగలుగుతారు?.
    రెడ్‌ బుక్‌ పెట్టడం ఏమన్నా పెద్ద పనా?. అదేమన్నా గొప్ప విషయమా?. న్యాయం, ధర్మం కచ్చితంగా ఉండాలని మన ప్రభుత్వంలో తాపత్రయ పడ్డాం. అందుకే ఈ మాదిరిగా పరిపాలన చేయలేకపోయాం. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. కలిసికట్టుగా పోరాడుదాం. ఉద్యమిద్దాం. కచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. 

ఆ స్ఫూర్తికి నా అభినందనలు:
    పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీచైర్మన్‌ పార్టీ మారినా, జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. వారి పోరాట స్పూర్తికి అభినందనలు. రాజకీయాల్లో మీరు విలువలు, విశ్వసనీయత చూపారు. 48 మందిలో మన పార్టీ తరపున 46 మంది గెలిచాం. అందులో ఒకరు ఎమ్మెల్సీ కావడంతో 45 మంది మిగిలారు. జడ్పీటీసీలందరికీ కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. 

పార్టీ అండగా ఉంటుంది:
     రాజకీయాలలో ఎప్పుడూ చీకటి ఉండదు. వెలుగు కూడా వస్తుంది. ప్రజల తరపున పోరాటాలు చేయండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన పని లేదు. చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ వేధింపులు, కేసులు తాత్కాలికం మాత్రమే. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. 
    ఇంత వేగంగా ప్రజల్లో వ్యతిరేకత మూట గట్టుకుంటున్న ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసులు పెడతారని ఎవరూ భయపడొద్దు.
    దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు అనేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారమే ఒక ఉదాహరణ. దారుణమైన అబద్దాలతో విష ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్‌ కళ్యాణ్‌.. అంతా కలిసి గోబెల్స్‌ ప్రచారం చేశారు. చంద్రబాబు ఒక అబద్దాన్ని సృష్టించి, ఆ అబద్దాన్ని మార్కెటింగ్‌ చేసి అమ్మేయగల సమర్ధుడు. అందుకే దేవుడు చంద్రబాబు పాపాలకు మెట్టికాయలు వేశాడని వైయస్‌ జగన్‌ వివరించారు.

Back to Top