తాడేపల్లి: తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మాట్లాడారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్న తాను, భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చానని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వెంకటేశ్వర స్వామిపై అత్యంత నమ్మకం ఉన్న హిందువుగా.. తన హయాంలో టీటీడీలో ఎలాంటి అపచారాలు, అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదని, ఆ స్వామి వారి పాదాల చెంత కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుబ్బారెడ్డి ప్రకటించారు. మరి దారుణ ఆరోపణలు చేసిన చంద్రబాబు కూడా, తన కుటుంబ సభ్యులతో అదే ప్రమాణానికి సిద్ధమా? అని ఆయన సవాల్ చేశారు. తాను మోపిన నిందకు చంద్రబాబు కట్టుబడి ఉంటే స్వామివారి పాదాల చెంత ప్రమాణానికి ముందుకు రావాలని స్పష్టం చేశారు. లేదంటే భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు కచ్చితంగా చట్టపరమైన చర్యల దిశగా పోరాటం చేస్తామని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు వైయస్సార్సీపీ ప్రభుత్వంపై పలు రకాలుగా దుష్ప్రచారం చేయడంతో పాటు, అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ వంద రోజుల పాలనలో.. అన్నింటా విఫలమైందని, అందుకే ఈ తరహాలో మరో దుష్ప్రచారానికి తెర లేపి హిందువుల మనోభావాలను దెబ్బ తినేలా వ్యవహరించారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు టీటీడీలో స్వామివారి నైవేద్యాలు, భక్తుల ప్రసాదాల తయారీలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించామని స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే, 2019 కంటే ముందున్న విధానాల కంటే మరింత మెరుగ్గా చేసుకుంటూ స్వామివారి సేవలు కొనసాగించామని వెల్లడించారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్న ఆయన, రోజులో ఐదు నుంచి ఏడు సార్లు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో 60 కేజీల నెయ్యి అవసరం అవుతుందని తెలిపారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాక ముందు కూడా అదే విధానం కొనసాగిందని చెప్పారు. కాగా, గత మూడేళ్లుగా మరింత పారదర్శకంగా.. స్వామివారికి సమర్పించే పులిహోర, లడ్డూతో పాటు ఇతర నైవేద్యాలకు అవసరమైన బియ్యం, పప్పులు వంటి అన్ని దినుసుల కొనుగోళ్లలో మెరుగైన విధానం అమలు చేశామని వెల్లడించారు. ఎరువులతో పండించిన దినుసులతో తయారు చేసిన విషపూరిత నైవేద్యాన్ని స్వామి వారికి సమర్పించే బదులు.. పూర్తిగా దేశీయ ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి, సేంద్రీయ సాగు ద్వారా పండించిన ఉత్పత్తులతోనే ప్రసాదాలు తయారు చేశామని టీటీడీ మాజీ ఛైర్మన్ తెలిపారు. అందులో భాగంగా రాజస్ధాన్ ఫతేపూర్‌లో 10 వేల దేశీయ ఆవులతో ఉన్న డెయిరీ నుంచి డోనర్ల సహాయంతో రోజూ 60 కేజీల నెయ్యి సేకరించామని, అందుకు రోజుకు లక్ష రూపాయల చొప్పున మూడేళ్లలో రూ.10 కోట్లు ఖర్చు కాగా, అదంతా దాతలే భరించారని చెప్పారు. అదే సమయంలో రోజూ అవసరమయ్యే ఆ 60 కేజీల నెయ్యిని స్థానికంగా తయారు చేసేలా టీటీడీ గోశాలకు రాజస్థాన్, గుజరాత్ నుంచి 550 దేశీయ ఆవులను తేవడంతో పాటు, ఆ పాలతో నెయ్యి తయారు చేసే ప్లాంట్ కూడా ఏర్పాటు చేశామని వివరించారు. లడ్డూ ప్రసాద తయారీలో నాణ్యత లోపించిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా సుబ్బారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే తీసుకుంటారన్న ఆయన, అలా నాణ్యత లేని 10 ట్యాంకర్లకు పైగా నెయ్యిని వెనక్కి పంపామని తెలిపారు. ల్యాబ్‌లో పరికరాలు పాత బడడంతో, ల్యాబ్‌ను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) సహకారంతో ఆధునీకరించామని వివరించారు. వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం రాజకీయ లబ్ధి, స్వార్ధ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇంత దుర్మార్గమైన ఆరోపణలు చేశారని, ఇది అత్యంత దారుణమని టీటీడీ మాజీ ఛైర్మన్ ఆక్షేపించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్న ఆయన, కోట్లాది భక్తుల మనోభావాలకు వి«ఘాతం కలిగించేలా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. ఇంకా టీటీడీలో రూ.520 కోట్ల దోపిడీ జరిగినట్లు, దానిపై విజిలెన్స్ కమిటీ నివేదిక సిద్ధమైనట్లు ఆరోపిస్తూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్న వైవీ సుబ్బారెడ్డి, దానిపైనా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.