రాజమహేంద్రవరం: మా ప్రభుత్వ హయాంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారని నాడు మాపై ఆరోపణలు చేసిన కూటమి నేతలు..ఇవాళ ఒక్కరినైనా తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చారా అని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. `లేని లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి కట్టు కథ అల్లి మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని భావించి, అక్రమ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. కూటమి గాలిలో కూడా ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పై మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అలాంటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అక్రమ కేసులో అరెస్టు చేశారు. ఆయన్ను ఇప్పటి వరకు కస్టడీకి ఎందుకు పిలవడం లేదు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు . కట్టు కథలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండి మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశౄరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కదా? మాపై చేసిన ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోతున్నారు. 30 వేల మంది మిస్సయ్యారన్న పెద్దమనుషులు..ఇవాళ ఎందుకు వెనక్కి రప్పించలేకపోతున్నారు. అంటే ఆ రోజు మీరు మాట్లాడింది తప్పు అన్నట్లే కదా?. గత ప్రభుత్వంలో కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు అన్నారు ఒక్క ఆధారమైన ఉందా...? కల్తీ మద్యం తాడి ఎంతోమంది ఆసుపత్రి పాలైతే ఒక కేసైనా నమోదు చేశారా? గత ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు చెరిపేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. ప్రీతి భాయ్ మర్డర్ కేసులో మృతురాలు తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు గురించి ఆరోపిస్తున్నారు. దానిని గమనించాలి. వైయస్ జగన్‌కు అన్నివేళలా మద్దతుగా ఉన్న వ్యక్తులకు మా మద్దతు కూడా ఎప్పుడు ఉంటుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు. రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఏమీ చేయకున్నా..అన్నీ చేసినట్లు పబ్లిసిటీ చేసుకోవడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది` అంటూ బైరెడ్డి ఎద్దేవా చేశారు. మిథున్ రెడ్డి ఎంపీ అయినా ఆయనకు జైల్‌లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని సిద్ధార్థరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.