కాపు సామాజిక వర్గానికి ర‌క్ష‌ణ క‌రువు

సాయికృష్ణ అదృశ్యంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం : రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి రక్షణ కరువైందని, కాపు యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. లోకేష్ రెడ్‌బుక్‌ను స్పూర్తిగా తీసుకుని పోలీసులు వ్యవహరిస్తున్నారని, పోలీస్ స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు.  గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పాలనలో లాకప్ మరణాలు పెరిగిపోయాయని, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదని విమర్శించారు.

గాదె సాయికృష్ణ 40 రోజులుగా కనిపించడం లేదని, అతనికి ఏమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒక తల్లికి నీ కొడుకు లేడు, ఫోటో పెట్టుకుని దండ వేసుకోమని చెప్పే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం" అని వ్యాఖ్యానించారు. సాయికృష్ణపై నమోదైన కేసులు ఏమిటో ప్రజలకు వెల్లడించాలని, అతని అదృశ్యంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసులో కేవలం ఒక సీఐపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబంతో బేరసారాలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించిన జక్కంపూడి రాజా, ముద్రగడ పద్మనాభం కుటుంబంపై జరిగిన ఘటనలు, అంబటి రాంబాబు ఇంటిపై దాడి వంటి సంఘటనలను ప్రస్తావించారు. హామీలు నెరవేర్చాలని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై వెంటనే స్పందించాలని, సాయికృష్ణ ఘటనపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చట్టపరమైన పరిపాలనను పునరుద్ధరించి, ప్రజలకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Back to Top