చిత్తూరు : డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలను నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చిత్తూరులో భారీ ఆందోళన నిర్వహించారు. చిత్తూరు అమూల్ డెయిరీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టిన యువజన నాయకులు, కార్యకర్తలు మెడలకు ఉరి తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించబోమని హెచ్చరించిన ఆయన, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో పూర్తి పారదర్శకత పాటించి, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. అనంతరం యువజన విభాగం నాయకులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డీసీ మనోజ్ రెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షుడు తేజేష్, పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్ శ్రీనివాసన్, భాగ్యరాజ్, దొరబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్రమణ్యం నాయుడు, ధనరాజ్, తనీష్, స్టాన్లీ, చంటి, గణపతి రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై అనంతలో ‘యువజనాగ్రహం’ అనంతపురం : మెగా డీఎస్సీ-2025లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ‘యువజనాగ్రహం’ కార్యక్రమం నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో యువజన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’’ అంటూ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఆందోళనలో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. విద్యాశాఖలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలంటే స్వతంత్ర విచారణ జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో దగాపడిన అభ్యర్థులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు అందజేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.