విజయవాడ: విజయవాడలో దారుణ వరద బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోటి రూపాయల సాయం చేయబోతున్నామని, అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని, ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయించారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని, మొత్తం ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. విజయవాడ, బ్రాహ్మణవీధిలోని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్‌లో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ దారుణ వైఫల్యం: విజయవాడ విపత్తు ప్రభుత్వ దారుణ వైఫల్యం అన్న బొత్స, ఇది కచ్చితంగా మానవ తప్పిదం అని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదలపై ఐఎండీ (వాతావరణ శాఖ) ముందే హెచ్చరికలు జారీ చేసిందని, దీనిపై ప్రభుత్వం వద్ద పూర్తిగా సమాచారం ఉందని, అయినా నిర్లక్ష్యం చేశారని, ఏ మాత్రం పట్టించుకోకపోగా, తమపై బురద చల్లుతున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు జీవితమంతా డ్రామా, షో.. లేఅన్న మండలి విపక్షనేత, వరద సహాయ పనుల్లో విఫలం అయ్యారు కాబట్టే, తమపై బురద చల్లుతున్నారా అని ప్రశ్నించారు. సమాధానం చెప్పండి: భారీ వర్షాలు, వరదలపై ముందే సమాచారం ఉన్నా, కనీసం సమీక్ష అయినా జరిపారా? ముందస్తు జాగ్రత్త చర్యలు ఏం తీసుకున్నారు? ఎన్ని రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు? ఆ శిబిరాల్లోకి ఎంతమందిని తరలించారు? నష్ట నివారణ చర్యలు ఎందుకు చేపట్టలేదు?. ఎగువన పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వరద తగ్గించి, ఫ్లడ్ వాటర్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? వార్నింగ్ లేకుండా బుడమేరు నుంచి నీరెలా వదిలారు?. అని సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది నిజంగా సిగ్గుచేటు: వరద బాధితులకు భోజనం పెట్టడం లేదని చివరకు సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారని గుర్తు చేసిన మండలి విపక్షనేత, వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని, నీళ్లు, పాలు కూడా సరఫరా చేయడం లేదని ప్రస్తావించారు. ఇది సీఎంకు, ప్రభుత్వానికి íసిగ్గు చేటు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. అదేనా చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం? అని నిలదీశారు. ఆ వరద కొత్త కాదు: 11లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు రావడం ఇదే మొదటిసారి కాదన్న బొత్స సత్యనారాయణ, గతంలో రోశయ్యగారు సీఎంగా ఉన్నప్పుడు.. ఇక్కడ ఆ పరిస్థితి వస్తే, అప్పుడు మంత్రిగా ఉన్న తాను, ఇక్కడ బస చేసి, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని మానిటర్ చేశామని, గంట గంటకు సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదే ఇప్పుడు సీఎం, ఏ జాగ్రత్తలు తీసుకోలేదని, కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆక్షేపించారు. అసలు ఎందుకు మేనేజ్ చేయలేకపోయారు? అధికారులు ఏం చేశారు? ఇరిగేషన్ శాఖ ఏం చేస్తోంది? మీరు, మీ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని ఆయన సీఎంను నిలదీశారు. ఆ వాల్ లేకపోయి ఉంటే..: ఈ విపత్తు కచ్చితంగా మానవ తప్పిదమే అన్న మండలి విపక్షనేత, తాము ఆ రీటెయినింగ్ వాల్ కట్టాము కాబట్టి, విజయవాడలో చాలా నష్ట నివారణ జరిగిందని, లేకపోతే ఎంతో ఆస్తి, ప్రాణనష్టం జరిగి ఉండేదని చెప్పారు. ఈ వర్షాలు, వరదలు అనూహ్యంగా రాలేదు కాబట్టి, ప్రజలకు తగినట్లుగా నీరు, పాలు, ఆహారం సిద్ధం చేయాలి కదా? ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ‘దాదాపు మూడున్నర లక్షల మంది విజయవాడ వరదల్లో బాధ పడుతున్నారని మీరే చెబుతున్నారు. మరోవైపు దుర్గమ్మ ఆలయం నుంచి పులిహోర ప్యాకెట్లు ఇచ్చామని చెబుతున్నారు. కానీ, ఇతర భోజన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? సీఎంగారు పడవల్లో తిరుగుతున్నారు. ఆయన వెంట సిబ్బంది కోసం మరిన్ని పడవలు వాడుతున్నారు. కానీ, ప్రజలను తరలిచడం కోసం తగిన సంఖ్యలో పడవలు ఎందుకు ఏర్పాటు చేయలేదు?’.. అని మండలి విపక్షనేత ప్రశ్నించారు. ఆనాడే హెచ్చరించాము: కృష్ణా కరకట్ట మీద ఆక్రమించి కట్టిన కట్టడాలు.. వరద వస్తే, మునిగిపోతాయని ఆనాడే తాను మంత్రిగా చెప్పానని, అది ఎప్పటికైనా ప్రమాదమని స్పష్టం చేశానని బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్కడే అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న సీఎం చంద్రబాబు, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు. సీఎం బస్సులో పడుకుంటే ఏమిటి? ఆఫీస్‌లో పడుకుంటే ఏమిటి? అన్న ఆయన, ఇప్పుడిప్పుడే వరద తగ్గుతోంది కాబట్టి, ప్రభుత్వం స్పందించాలని, ప్రజలను ఆదుకోవాలని కోరారు. పని చేయని అధికారులపై చర్యలు తీసుకోమన్న ఆయన, దాన్ని వద్దనడం లేదని చెప్పారు. అంతే తప్ప, అదే పనిగా తమని నిందించడం సరికాదని స్పష్టం చేశారు. అది కుట్ర కోణమా!: ఎగువ నుంచి పడవలు కొట్టుకొచ్చి, ప్రకాశం బ్యారేజీ లాక్‌లను తగిలితే, అది కుట్రకోణం అనడం దారుణమన్న మండలి విపక్షనేత, గతంలో కూడా ఒక పడవ కొట్టుకొస్తే, అది కూడా మా కుట్ర అని, అలా చంద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని ముంచే ప్రయత్నం చేశారని ఆరోపించారని గుర్తు చేశారు. కనీసం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన, పడవలు కొట్టుకొస్తే అది కుట్ర ఎలా అవుతుందని నిలదీశారు. ఎగువ నుంచి వరదను కట్టడి చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని తేల్చి చెప్పారు. ఎంతసేపూ ఆర్భాట ప్రకటనలు తప్ప, ఎక్కడా కార్యాచరణ లేదన్న బొత్స సత్యనారాయణ, తాము దేన్నీ రాజకీయం చేయదల్చుకోలేదని, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని, అందరినీ కలుపుకుపోవాలని అన్నారు. తమ పార్టీ చేస్తున్న సహాయ పనుల్లో అధికారులు సహకరించాలని కోరారు.