మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి

విజయవాడ టౌన్‌హాల్ సమావేశంలో వైయస్సార్‌సీపీ నేతల డిమాండ్

విజయవాడ: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ అధ్యక్షతన నిర్వహించిన టౌన్‌హాల్ సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

డీఎస్సీపై పారదర్శక విచారణ జరగాలి

డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, స్పోర్ట్స్ కోటా భర్తీలు, మెరిట్ లిస్టు విడుదల చేయకపోవడం, నిబంధనల మార్పులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే సీబీఐ విచారణకు వెనుకాడాల్సిన అవసరం లేదని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కులు కాపాడాలని డిమాండ్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని నేతలు కోరారు. డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం

డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ నియామక ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, సీబీఐ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, నిరుద్యోగ యువతకు వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని సమావేశంలో నేతలు పునరుద్ఘాటించారు.

Back to Top