ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలను బలితీసుకుంది

బోటు ప్రమాదంపై స్పందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ధ్వ‌జం

విశాఖపట్నంలోని మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ  విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యకారుల విభాగం అధ్యక్షుడు విజయ్ చంద్ర కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు మత్స్యకారుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ప్రమాద సమాచారం వచ్చిన వెంటనే స్పందించి ఉంటే ఆరుగురు మత్స్యకారులను కాపాడే అవకాశం ఉండేది.

24 గంటల పాటు రక్షణ వ్యవస్థలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది.

వారం రోజులు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించలేదు.

రూ.10 లక్షల పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

మత్స్యకారుల భద్రత, బీమా, రక్షణ చర్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

ప్రాణాలతో బయటపడిన చిన్నాకు కేవలం రూ.50 వేల సాయం చేయడం అన్యాయం.

పూర్తిగా దెబ్బతిన్న బోటుకు తగిన పరిహారం ప్రకటించలేదు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మత్స్యశాఖ మంత్రి ఘటనాస్థలికి వెళ్లకపోవడం బాధాకరం.

వైఎస్ జగన్ ఫోన్‌లో బాధితుడు చిన్నాకు ధైర్యం చెప్పి త్వరలో పరామర్శిస్తానని హామీ ఇచ్చారు.

గతంలో జగన్ ప్రభుత్వం బోట్లు దగ్ధమైన ఘటనల్లో 24 గంటల్లోనే భారీ పరిహారం అందించింది.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి

మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు 

విశాఖ‌ప‌ట్నం: విశాఖపట్నం సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైయ‌స్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, సంబంధిత వ్యవస్థలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. వారం రోజులు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించకుండా, తూతూమంత్రంగా పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం అమానుషమని మండిపడ్డారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మొల్లి అప్పారావు, గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి, విజ‌య్ చంద్ర మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు మత్స్యకారుల భద్రతకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే.. 

-  ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణనష్టానికి కారణం: మొల్లి అప్పారావు

ప్రమాద సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం స్పందించి, సముద్రంలో రక్షణ చర్యలు ప్రారంభించి ఉంటే ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది. కానీ 24 గంటల పాటు సంబంధిత వ్యవస్థలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి వారం రోజులు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించలేదు. మత్స్యకారుల భద్రత, బీమా, జీవనోపాధి విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. కేవలం రూ.10 లక్షల పరిహారం ప్రకటించి బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూడటం సరైన విధానం కాదు. గతంలో శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోట్లు దగ్ధమైన ఘటనల్లో 24 గంటల్లోనే భారీ పరిహారం అందించి మత్స్యకారులకు అండగా నిలిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం అదే మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలి. ప్రాణాలతో బయటపడిన చిన్నాతో వైయ‌స్ జగన్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలో స్వయంగా బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది.  

- మత్స్యకారులను పరామర్శించే తీరిక సీఎం, డిప్యూటీ సీఎంకు లేదా?: విజయ్ చంద్ర, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం అధ్యక్షుడు 

సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన ఇంతటి విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,  మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం అత్యంత బాధాకరం. చిన్న చిన్న కార్యక్రమాలకు సమయం కేటాయించే ప్రభుత్వ పెద్దలకు, ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మాత్రం సమయం లేకపోవడం విచారకరం. గతంలో శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు నిర్మించి వారి జీవనోపాధిని బలోపేతం చేశారు. ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కానీ ప్రస్తుతం మత్స్యకారుల ప్రాణాలకు ప్రభుత్వం కనీస విలువ కూడా ఇవ్వడం లేదు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే గౌరవప్రదమైన పరిహారం అందించాలి. మత్స్యకారుల భద్రత కోసం శాశ్వత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ వారి పక్షాన నిలబడి పోరాడుతుంది.  

- ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి: తిప్పల దేవన్‌రెడ్డి 

సముద్ర ప్రమాదంలో కుటుంబాలకు ఆధారమైన యువ మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కేవలం రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం ద్వారా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్టుగా భావించడం సరైంది కాదు. ఆ కుటుంబాల భవిష్యత్తు, చిన్నపిల్లల చదువులు, జీవనోపాధి ఎలా సాగాలన్న అంశాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రమాద సమాచారం అందిన తర్వాత కూడా రక్షణ చర్యల్లో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. సమయానికి స్పందించి ఉంటే ప్రాణనష్టం తగ్గించే అవకాశం ఉండేది. ప్రాణాలతో బయటపడిన చిన్నాకు కేవలం రూ.50 వేల సాయం ప్రకటించడం మరింత బాధాకరం. ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బోటుకు తగిన పరిహారం కూడా ప్రకటించకపోవడం అన్యాయం.

గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి ఘటనల్లో వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు, బోటు యజమానులకు భారీ పరిహారం అందించింది. ఇప్పుడు కూడా అదే మానవత్వంతో ప్రభుత్వం వ్యవహరించాలి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం, బోటు నష్టానికి పూర్తి పరిహారం వెంటనే ప్రకటించాలి. మత్స్యకారుల ప్రాణాలకు రక్షణ కల్పించే శాశ్వత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు.

Back to Top