నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తొలిరౌండ్ నుంచి వైయస్ఆర్ సీపీ హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో సైతం వైయస్ఆర్ సీపీ భారీ ఆధిక్యం చేజిక్కించుకుంది. మొత్తం 217 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గానూ 205 ఓట్లు చెల్లినవి.. వాటిల్లో 167 ఓట్లు వైయస్ఆర్ సీపీకే దక్కాయి. మొత్తం 20 రౌండ్లకు గానూ 13 రౌండ్లు పూర్తయ్యే సరికి మేకపాటి విక్రమ్‌రెడ్డి 54,448 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. 16 రౌండ్లు పూర్తయ్యే సరికి 66,477 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 17 రౌండ్లు పూర్తయ్యే సరికి 71,887 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు వైయస్ఆర్ సీపీ మెజార్టీ పెరుగుతోంది. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలంతా ఉప ఎన్నికలో ఏకపక్ష తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై పూర్తి విశ్వాసంతో, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబంపై అభిమానం, ప్రేమతో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకపక్షంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేశారు. గతం కంటే ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినప్పటికీ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాత్రం భారీ మెజార్టీ దిశగానే దూసుకెళ్తున్నారు.