విజయవాడ: విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసి, దేశంలో నిబంధనల ప్రకారం అన్ని అర్హతా ప్రమాణాలను సాధించిన యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేయడంలో కూటమి ప్రభుత్వం అత్యంత కక్షసాధింపు దోరణిని అనుసరిస్తోందని వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం నేతలు డాక్టర్ సీదిరి అప్పలరాజు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావులు మండిపడ్డారు. తమ పీఆర్ సర్టిఫికేషన్ కోసం గత కొన్ని రోజులుగా విజయవాడ ధర్నాచౌక్‌లో ఆందోళన చేస్తున్న యువ వైద్యుల దీక్షా శిబిరాన్ని వైయస్ఆర్‌సీపీ నేతలు సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి వీసీ, రిజిస్ట్రార్‌ను కలిసి యువ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. యువ వైద్యులపై పోలీసుల దాష్టీకం దారుణం : డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు మహిళా వైద్య విద్యార్ధినిలను జుత్తు పట్టుకుని పోలీసులు అత్యంత జుగుప్సాకరంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం దారుణం. విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకోవడమే వాళ్లు చేసిన తప్పా? అందుకోసం ప్రభుత్వం చేతిలో తన్నులు తినాలా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వైద్య విద్యార్ధుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించారు. వారితో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం వారి డిమాండ్‌లపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపధ్యంలో వైయస్ జగన్ ఆదేశాల మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ వింగ్ తరపున ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, రిజిస్ట్రార్ లను కలిశాం. విదేశాల్లో 54 నెలల తరగతులు, 12నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన యువ వైద్యులు మన దేశంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ కూడా పాసయ్యారన్నారు. ఆ తర్వాత ఏడాది పాటు ఇంటర్నెషిప్ చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా దానిని కూడా పూర్తి చేసినా ప్రభుత్వం ఎందుకు వారికి పర్మినెంట్ రిజిష్ట్రేషన్ చేయడం లేదు? తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన విదేశీ వైద్య విద్యార్ధులకు అయా రాష్ట్రాలు పీఆర్ చేశాయి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం సాకులు చెపుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. యువ వైద్యుల కెరీర్‌తో కూటమి సర్కార్ చెలగాటం : డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కావాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విదేశీ వైద్య విద్యార్థులను అరెస్టు చేయడంతో పాటు వారిపై వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. సమాజానికి సేవ చేసేందుకు పవిత్రమైన వైద్య విద్యను పూర్తి చేసిన వారిపట్ల అరెస్టు సమయంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. యువ వైద్యుల జుత్తుపట్టుకుని ఈడ్చుకెళ్లడంతో పాటు మహిళా విద్యార్ధుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. కాబోయే డాక్టర్ల పట్ల కూడా రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేయడం కూటమి నియంత పాలనకు పరాకాష్ట. యువ వైద్యుల కెరీర్‌తో చెలగాటం ఆడుతున్నారు. న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తున్న 69 మంది విద్యార్ధుల మీద నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేతృత్వంలో నేరుగా విద్యార్ధులకు మద్ధతుగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. యువ వైద్యుల డిమాండ్‌ను సానుభూతితో పరిశీలించాలి : డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే అన్ని రకాల కోర్సులు, అవసరమైన పరీక్షలు పూర్తి చేసుకున్న విదేశీ వైద్య విద్యార్ధులకు పర్మినెంట్ రిజిష్ట్రేషన్ చేయకపోవడం ముమ్మూటికే ప్రభుత్వ తప్పిదమే. కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం వల వివిధ దేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారు. భారత దేశంలోనూ ఇదే తరహాలో విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారు. అయినా కూడా ప్రభుత్వం రకరకాల సాకులు చూపుతూ విద్యార్ధులను వేధించడం సరికాదు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం లేదు సరికదా, విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించిన మన పిల్లల పట్ల మొండి వైఖరితో వ్యవహరించడం అమానుషం. సంబంధిత అధికార్లు తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ భరత్ రెడ్డి, సత్తెన పల్లి సమన్వయకర్త సుధీర్ భార్గవరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, వైద్య విభాగం స్పోక్స్ పర్సన్ డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.