మీ పిల్ల‌ల‌ను ఇలాగే ఈడ్చి ప‌డేస్తారా?

మెడిక‌ల్ విద్యార్థుల‌పై పోలీసుల దాడి దారుణం

దాడిని ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత‌లు

అనంత‌పురం:  శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న మెడిక‌ల్ విద్యార్థుల‌ను ఈడ్చి ప‌డేసిన పోలీసులు, త‌మ పిల్ల‌ల‌నైతే  ఇలాగే చేస్తారా అని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ ప్ర‌శ్నించారు. విజ‌య‌వాడ‌లో యువ విద్యార్థుల‌పై పోలీసుల దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని వచ్చిన విద్యార్థులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ పీఆర్ ఇవ్వకుండా  కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు. యువ డాక్టర్లు ప్రభుత్వాన్ని వేడుకున్న కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ నెల 3వ తేదీ విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేప‌ట్టిన మెడికల్ విద్యార్థులను దారుణంగా పోలీసుల చేత ఈడ్చిపడేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లేడి డాక్టర్లని కూడా చూడకుండా జుట్టు పట్టి ఈడ్చుకుంటూ బూటు కాళ్లతో తొక్కిన పోలీసులు,  మీ పిల్లల ప‌ట్ల ఇదేవిధంగా వ్య‌వ‌హ‌రిస్తారా అని ప్ర‌శ్నించారు.  యువ విద్యార్థుల‌కు పీఆర్ ఇచ్చి వారి న్యాయ‌మైన డిమాండ్‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న కోరారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం   జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి , అనంత‌పురం వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్య‌క్షుడు కైలాష్ , కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

Back to Top