తిరుపతి: మామిడి రైతులను ఆదుకునేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఎన్డీఏ నేతలు చేస్తున్న ప్రయత్నాలను చూసైనా సీఎం చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ రాష్ట్రం లోని మామిడిని కొనుగోలు చేయించుకునేందుకు కేంద్ర మంత్రి ద్వారా హామీ లేఖను సాధించారని అన్నారు. తమ మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎందుకు కేంద్రం ద్వారా ఈ మేరకు భరోసాను పొందలేక పోతున్నారని నిలదీశారు. కనీసం కేంద్రానికి లేఖ రాయాలనే ఆలోచన కూడా వారికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మామిడి రైతుల కష్టాలపై వారికి ఏ మాత్రం చిత్తశుద్ది లేదనేందుకు ఈ నిర్లక్ష్యమే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... చిత్తూరు జిల్లాలో ఉన్న మాదిరిగానే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ మామిడి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల సమస్యలపై కర్నాటక లోని జేడీఎస్ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు తక్షణం తమ రాష్ట్రం లోని రైతులను ఆదుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై తక్షణం స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కర్నాటక రాష్ట్రం నుంచి 2.50 లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16లకు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ అధికారికంగా లేఖ రాశారు. ఇద్దరు ఎంపీల మద్దతిచ్చిన జేడీఎస్ కి కేంద్రం స్పందిస్తే, 18 మంది ఎంపీల మద్దతిచ్చిన చంద్రబాబు, ముగ్గురు ఎంపీలతో మద్దతిచ్చిన పవన్ కళ్యాన్ ఎందుకు ఇలా ధైర్యంగా కేంద్రానికి లేఖ రాయడం లేదు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రజా సమస్యలపై పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోవడం లేదు. ఒకపక్క రైతులు మద్దత ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కుప్పం వచ్చిన చంద్రబాబు, 2029కి పీ4తో రాష్ట్ర స్వరూపాన్నే మార్చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మామిడి పంటను ఎక్కువగా పండిస్తారు. ఆ నియోజకవర్గంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే టీడీపీ ఎమ్మెల్యే థామస్ మాత్రం కోట్ల రూపాయలు వెచ్చించి జన్మదిన వేడుకలు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై మా పార్టీ ప్రశ్నిస్తే తోలు తీస్తాం, కాళ్లు విరిచేస్తాం అనడం, సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలుక మందం అని భయపెట్టాలని చూస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయాలనే ఉబలాటం తప్ప, ప్రజలకు ఈ ఏడాది పాలనలో ఒరగబెట్టింది శూన్యం. ప్రజా సమస్యలపై మా నాయకులు వైయస్ జగన్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేని చంద్రబాబు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వంచన, వెన్నుపోటు, హింసతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. మద్దతుధర ఇస్తున్నామంటూ మాయమాటలు మామిడి పంటకు మద్ధతు ధర చెల్లించకపోవడంతో లక్షల హెక్టార్లలో పండించిన పంటను రోడ్డుపై పారబోసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా రాయలసీమలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గోస వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం కేజీకి రూ.4 ల మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఏ ఒక్కరికీ చెల్లించిన పాపానపోలేదు. ఒక్కో ఎకరాకి 60 నుంచి 80 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. పంట బాగా పండినా మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడి రైతుల సమస్యలపై గళమెత్తి ప్రభుత్వం మెడలు వంచడానికి ఈనెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం వస్తానని వైయస్ జగన్ ప్రకటించగానే, ఆయన ఎందుకొస్తున్నారంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నారు. వైయస్ జగన్ వస్తున్నారనే భయంతో పల్ప్ ప్యాక్టరీ యజమానులతో చంద్రబాబు సంప్రదింపులు జరిపి కేజీ మామిడిని రూ.8లకు కొనుగోలు చేయాలని ఆదేశించాడు. ప్రభుత్వం రూ.4లు మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పాడు. అయినా ఇటు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించకపోవడం, ఇంకోవైపు పల్ప్ ఫ్యాక్టరీ యజమానులు కేజీ రూ.2లకు మించి కొనకపోవడంతో మామిడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. ఈనెల 9న చిత్తూరు జిల్లాకి వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా జూలై 9న మామిడి రైతులను పరామర్శించడానికి మా నాయకులు వైయస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యెం పర్యటనకు వస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. వైయస్ఆర్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. మా నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్‌రెడ్డిలను లేకుండా చేస్తే నియోజకవర్గంలో పార్టీని లేకుండా చేయొచ్చనే భ్రమల్లో ఉన్నట్టున్నారు. వారి కలలు ఎప్పటికీ నెరవేరవు. జిల్లా అధ్యక్షుడిగా ఆ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను కాపాడుకుంటాం.