యువ వైద్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు

వారికి పీఆర్‌ చేయకుండా దారుణ వేధింపు

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడం ఏమైనా నేరమా?

ఎన్‌ఎంసీ పరీక్ష రాసి, ఇంటర్న్‌షిప్‌ చేసినా అనర్హులేనా

దేశమంతా పీఆర్‌ ఇస్తున్నా, ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు?

ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడెందుకు అమలు చేస్తున్నారు?

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినా తప్పేనా?

పోలీసులతో ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు?

రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగమా?

ప్రభుత్వాన్ని నిలదీసిన వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు 

యువ వైద్యుల డిమాండ్‌ వెంటనే పరిష్కరించాలి

వారందరికీ తక్షణమే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలి

ప్రభుత్వం ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి

వైయ‌స్ఆర్‌సీపీ నేతల డిమాండ్‌

యువ వైద్యులపై పోలీసుల దాష్టికాన్ని ఖండిస్తున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ నేతల సంయుక్త‌ ప్రకటన

తాడేప‌ల్లి: యువ వైద్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు చ‌ర్య‌లు స‌రికాద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిప‌డ్డారు. వారికి పీఆర్‌ చేయకుండా దారుణ వేధించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడం ఏమైనా నేరమా? అని సంయుక్తంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు, డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి. డాక్టర్‌ సునిల్‌ ఏమన్నారంటే..:
    యువ వైద్యులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. వారికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) చేయకుండా దారుణంగా వేధిస్తోంది. అసలు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడమే నేరమన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణులై కౌన్సెలింగ్‌ తర్వాత నిబంధనలకు అనుగుణంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసినా వారు ఇంకా అనర్హులేనా? దేశమంతా పీఆర్‌ చేస్తున్నా, ఇక్కడ ఎందుకు చేయడం లేదు? ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడెందుకు అమలు చేస్తున్నారు? తమకు న్యాయం చేయాలంటూ యువ వైద్యులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పేనా? వారిని అదేపనిగా పోలీసులతో ఎందుకు అణిచివేయాలని చూస్తున్నారు? అలా రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత దారుణం.
    అన్ని విధాలుగా అర్హత సాధించిన తమకు వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) చేయాలని డిమాండ్‌ చేస్తూ, విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన యువ వైద్యులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోక పోవడం హేయం. పైగా వారిని అణిచివేయాలని చూడడం అత్యంత దారుణం. తమకు వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి నెంబర్‌ ఇవ్వాలన్న యువ వైద్యుల డిమాండ్‌ సహేతుకం. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్‌ నెరవేర్చాలి. ఇప్పటికే వారంతా కెరీర్‌ పరంగా ఏడాది నష్టపోయారు.
    విజయవాడలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ను కలిసేందుకు వచ్చిన యువ వైద్యులను పోలీసులు అడ్డుకోవడం ఏ మాత్రం సరి కాదు. వారికి సంఘీభావంగా వచ్చిన విద్యార్థి సంఘాల ప్రతినిధులపైనా పోలీసులు అమానుషంగా వ్యవహరించారు.
వారందరినీ బలవంతంగా తరలించడంలో పోలీసులు దాష్టికంగా వ్యవహరించారు. దీంతో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగిపోగా, మహిళా యువ వైద్యురాళ్లను కూడా పోలీసులు విడిచిపెట్టకుండా బలవంతంగా వ్యాన్‌ లో ఎక్కించారు. ఆ తర్వాత వారందరినీ ఏఆర్‌ గ్రౌండ్స్‌కు తరలించారు. పోలీసుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
    వైద్యులు కావాలన్న సంకల్పంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన యువ వైద్యులు, ఇక్కడ కావాల్సిన అన్ని అర్హత పత్రాలు పొందారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వారికి పీఆర్‌ నెంబర్‌ ఇవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏవేవో సాకులు చెబుతూ, యువ వైద్యుల పీఆర్‌ చేయకుండా, వారిని వేధిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏడాదికి మించి ఇంటర్న్‌షిప్‌ చేయిస్తోంది. ఆ తర్వాత కూడా వారికి పీఆర్‌ నెంబర్‌ ఇవ్వకపోవడంతో కెరీర్‌ పరంగా నష్టపోతున్న వారు, పీజీ మెడికల్‌ కోర్సులు కూడా చేయలేకపోతున్నారు. 
    కాబట్టి, ప్రభుత్వం వెంటనే యువ వైద్యుల డిమాండ్‌ పరిష్కరించాలి. ప్రభుత్వ నిర్వాకం వల్ల 700 కు పైగా యువ వైద్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అందుకే వారందరినీ తక్షణమే పీఆర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. యువ వైద్యుల న్యాయమైన డిమాండ్‌ సాధనలో వారికి మా పార్టీ అండగా నిలుస్తుంది.

Back to Top