కడప: బనకచర్ల ప్రాజెక్ట్‌పై గురు శిష్యులు అయిన ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు దోబూచులాట ఆడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడంపైన మాత్రమే దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారని, ఆయన సెక్యూరిటీ లేకుండా వెళ్తే కాలర్ పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. `బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అనే కార్యక్రమంపై గురువారం వైయస్ఆర్ జిల్లాలో వైయస్ఆర్‌సీపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏడాది పాటు ప్రజలను ఎలా మోసం చేశాడో మనం ప్రజలకు వివరించాలి. ఏడాది పాలనలో అక్రమ కేసులు పెట్టడం పైన మాత్రమే దృష్టి పెట్టారు. రామారావును వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం ఎత్తివేశారు.. రెండు రూపాయల కిలో బియ్యం ఆపేసి ప్రజలను మోసం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే తరహాలో ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారు. 2014లో కూడా మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేశారు. 2024లో మరోసారి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. గ్రామాల్లో తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాన్ని మనం వివరించాలి. బాబు ష్యూరీటీ మోసం గ్యారంటీ అంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించాలి. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు బనకచర్ల ప్రాజెక్ట్ పై గురు శిష్యులు దోబూచులాడుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకరిపై మరొకరు పెట్టుకొని బనకచర్ల ప్రాజెక్ట్ వివాదానికి తెర లేపారు. బాబుకు బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. అందుకే వాటిని వివాదాస్పదం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలి. ఒక్క సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలనా అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గు చేటు. సంక్షేమ పథకాలను ఏడాది విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం ఏంటి?.ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాక ఆయన హయాంలోని సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కారు. హామీలన్నింటినీ తుంగలోకి తొక్కారు. మోసపురిత మాటలు నమ్మి ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసినా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే.. ప్రజలే చెబుతారు ప్రతీదీ అబద్దాలు చెప్పడం మోసపురిత వాగ్దానాలను చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..త్రికరణశుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు, మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌కే దక్కింది. ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారు. పోలీసుల పహారా మధ్య ఇంటింటికి.. సెక్యూరిటీ లేకుండా వెళ్ళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారు. సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలే చెబుతారు’ అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , దాసరి సుధా , ఎమ్మెల్సీలు డి.సి. గోవింద్ రెడ్డి, రామచంద్రారెడ్డి , రమేష్ యాదవ్, మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి, పాన్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.