తాడేపల్లి: దళితుడు సింగయ్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకారంతో ఉపయోగించిన భాషపై వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కుక్కతో పోల్చడానికి చంద్రబాబుకు మనస్సెలా వచ్చిందని ప్రశ్నించారు. దళితుల శవాలతో రాజకీయం చేయాలని చంద్రబాబు, లోకేష్‌లు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారికి చిత్తశుద్ది ఉంటే సింగయ్య భార్య లూర్ధుమేరి వ్యక్తం చేసిన అనుమానాలపై విచారణ జరిపి, వాస్తవాలను బయటపెడతారా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. చంద్రబాబు దళితులను చులకన చేస్తూ వారి పట్ల ఎంతో అహంకారంతో మాట్లాడారు. సింగయ్య ప్రమాదానికి గురయ్యాడని తెలియగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు హాస్పటల్‌కు తరలించాలని ప్రయత్నిస్తే, పోలీసులు వారిని వారించి అంబులెన్స్ పిలిచామంటూ అరగంట సేపు జాప్యం చేయడం వల్లే ఆయన పరిస్థితి విషమించింది. ఆయన భార్య లూర్ధుమేరి ఈ కూటమి ప్రభుత్వ కుట్రలను బయటపెట్టింది. పేద దళిత కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఈ ప్రభుత్వం దానిని సానుభూతితో చూడాల్సింది పోయి, రాజకీయంగా వాడుకోవాలని చూసింది. చంద్రబాబు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మా దళితుల శవాలే కావాల్సి వచ్చాయా? మంత్రి నారా లోకేష్ తన మనుషులను సింగయ్య ఇంటికి పంపి, ఆయన భార్యను బెదిరింపులకు గురి చేశారు. సింగయ్య మరణాన్ని వైయస్ జగన్‌కు, వైయస్ఆర్‌సీపీకి ఆపాదించాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు చేసిన కుట్రలను మృతి భార్య ధైర్యంగా మాట్లాడి బద్దలు కొట్టింది. తన భర్త మరణంపై ఆమె స్వయంగా వైయస్ జగన్‌ను కలిసి తన బాధను, అనుమానాలను చెప్పుకున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు, లోకేష్‌లు కంగుతిన్నారని, వైయస్ జగన్‌ను చక్రబంధంలో పెట్టాలనుకున్న వారి కుట్రలు నీరుగారాయి. చంద్రబాబు ఇప్పటికైనా దళితులను మనుషులుగా గుర్తించాలి. ఒక చర్మకారుడిని రెండు గంటల పాటు తన కారుతో తిప్పానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. ఇది జరిగి 48 గంటలు దాటకముందే దళితులు అంటే కుక్కలతో సమానమంటూ మాట్లాడారు. అలా దళితులను అవమానిస్తారా? గతంలోనూ దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు మాట్లాడారు. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు దళితులు శుభ్రంగా ఉండరు అంటూ హేళన చేశారు. ఇలాంటి నైజం ఉన్న చంద్రబాబు దళితులను ఎలా గౌరవిస్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు దళితులను కనీసం మనుషులుగా అయినా చూడాలి. దళితుల శవాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.