ఒంగోలు: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న ఒంగోలులో నిర్వహించనున్న వైయస్ఆర్‌సీపీ విద్యార్థి–యువత నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వ వైఫల్యం, నీట్ పరీక్షలో వెలుగుచూసిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, దర్శి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.