వైయస్ఆర్ జిల్లా: ప్రశాంతంగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు హింసను ప్రేరేపించి చెలరేగిపోతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేము ముందుగా చెప్పినట్లే టీడీపీ అరాచకాలు ప్రారంభమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండువారిపల్లిలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాముపై టీడీపీ గూండాలు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్న రాముపై టీడీపీ మూకలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం హేయమన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..` మా వాళ్ళపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. కేవలం వైయస్ జగన్ ను ఓడించాం అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న మా వాళ్లను పెళ్లికి వెళితే అదే పెళ్లిలో దాడులకు దిగారు. హత్యాప్రయత్నాలు చేశారు...అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలని ఓటింగ్ కి రాకుండా చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 16 మందిపై హత్యాయత్నం కేసు పెట్టామన్నారు...వాళ్లను అరెస్ట్ చేశారా..? దేని కోసం వారు ఈ దాడులకు దిగుతున్నారు అనేది బయటకు చెప్పాలి. వెంటనే వారిని రిమాండ్ కి పంపండి. ఇప్పుడే మరొక నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు. ప్రజాస్వామ్యంలో ఇది సక్రమమైన పద్ధతేనా..? ప్రజలు దీన్ని హర్షిస్తారా..? పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి..? రానున్న రోజుల్లో హత్యలు కూడా చేయడానికి వెనుకాడరు. ఈ హింసను ప్రజలు, పులివెందుల ఓటర్లు గమనించాలి` అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.