విశాఖ: ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..? అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పులివెందులలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్, వేల్పుల రాములపై టీడీపీ గూండాల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. `పులివెందుల్లో వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నల్లగొండువారిపల్లెలో ప్రభుత్వ అండతో టీడీపీ గూండాలు రెచ్చిపోయి బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై కూడా దాడికి దిగడం దారుణం. ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..?. పచ్చ మూకల దాడిలో వైయస్ఆర్‌సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.? సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. పులివెందుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి` అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.