నేతన్నలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు..

జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌పై నేటికీ నిర్థిష్ట విధివిధానాలు లేవు..

మండిపడ్డ మాజీ ఎంపీ బుట్టా రేణుక

కర్నూలులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుట్టా రేణుక

చేనేత కార్మికులను పదేపదే దగా చేస్తున్న చంద్రబాబు..

టీడీపీ హయాంలో నేతన్నల కోసం చేసిన ఖర్చు రూ.442 కోట్లు..

వైయస్ఆర్‌సీపీ హయాంలో చేసిన ఖర్చు రూ.3706 కోట్లు..

2024లో ఇచ్చిన హామీలపై 14 నెలలుగా కూటమి సర్కార్ నిర్లక్ష్యం..

ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రకటించాలి..

మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్

కర్నూలు: ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని మోసం చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జ్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. కర్నూలులో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఎన్నికలకు ముందు చేనేత కార్మికులకు అనేక హమీలు ఇచ్చిన చంద్రబాబు ఈ పద్నాలుగు నెలలుగా వాటి అమలుపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ పై నేటి వరకు కనీసం విధి విధానాలను కూడా ఖరారు చేయకుండా చేనేత రంగంపై తనకున్న చిన్నచూపును చాటుకున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

2024 మేనిఫేస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, మగ్గాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతోంది. చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే విధానానికి దూరం. ప్రజలకు ఇచ్చిన మాటలను గాలికివదిలేయడం ఆయనకు అలవాటు. నాలుగోసారి సీఎంగా ఉండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ది లేకుండా తన పాలనను కొనసాగిస్తున్నారు. 2014 లో కూడా చేనేతలకు రుణమాఫీ, షెడ్లు, ఇళ్ళు నిర్మించి ఇస్తామని, వర్షాకాలంలో మగ్గాల గుంతల్లో నీరు చేరి పనులు చేసుకోలేని పరిస్థితిలో నెలకు రూ.2 వేలు చొప్పున రెండు నెలల పాటు ఇస్తామని, రూ. వెయ్యి కోట్లతో నిధులను ఏర్పాటు చేసిన చేనేతలకు అండగా నిలుస్తామని హామీలు గుప్పించారు. కానీ తన పాలనలో వీటిని పట్టించుకోకుండా చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం నాడు కూటమి ప్రభుత్వానికి తాను ఇచ్చిన హామీలు గుర్తుకు వచ్చాయా..? మరమగ్గాలకు 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్ మగ్గాలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కనీసం ఎప్పటి నుంచి దీనిని అమలు చేస్తారో చెప్పలేదు. 2014 లో చేనేత రంగానికి సుమారు 25 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. రుణమాఫీ, హెల్త్‌కార్డ్, ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షల సాయం అన్నారు. వీటిల్లో ఏ ఒక్కటి కూడా నేతన్నలకు అందలేదు. యువగళం పేరుతో నారా లోకేష్‌ తన పాదయాత్రలో నేతన్నలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. 

 వైయస్ఆర్‌సీపీ హయాంలో నేతన్నకు మేలు:

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నేతన్నల కోసం ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.24 వేల చొప్పున అయిదేళ్ళకు ఒక్కో కుటుంబానికి రూ.1.20 లక్షలు ఇచ్చారు. నేత కార్మికులకు నైపూణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, సబ్సిడీకి లూమ్స్, షెడ్స్, పరికరాలకు ఆర్థిక చేయూతను అందించారు. తయారయ్యే వస్త్రాన్ని మార్కెట్ చేసుకునేందుకు, మంచి రేటు లభించేందుకు ఈ-కామర్స్‌ సంస్థలతో భాగస్వామ్యం కల్పించారు. ఆప్కోను అభివృద్ధి చేసి, వివిధ ప్రాంతాలకు విస్తరింపచేశారు. 92,724 మందికి పెన్షన్లు ఇస్తుంటే, దానిలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం సొంతమగ్గాలు ఉన్న 82,130 మందికి నేతన్ననేస్తంను అందించారు. దీనిపైన కూడా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం తాజా హామీల్లో మొత్తం 91,300 మందికి ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. కానీ నేడు వాటిని కుదించి కేవలం 50,000 సొంత మగ్గాలు ఉన్నవారికి, 15వేల మరమగ్గాల వారికి మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఇది మోసం కాదా..? చేతివృత్తులు, గ్రామాల్లోని కుటీర పరిశ్రమల వారికి జీఎస్టీ మినహాయింపు ఉంది. రూ.1000 వరకు ఉంటే 5 శాతం, అది దాటితే 12 శాతంగా విధిస్తున్నారు. దీనిని చేనేతకు ఎలా మినహాయింపు కల్పిస్తారో కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వంలో నేతన్నల కోసం రూ. 442 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో మిగిల్చిన రూ.103 కోట్లు బకాయిలతో కలిపి అయిదేళ్ళలో రూ.3706 కోట్లు ఖర్చు చేసింది. 2018-19 తెలుగుదేశం హయాంలో నేతన్న సగటు ఆదాయం రూ. 4,680 ఉంటే, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అందించిన ప్రోత్సాహం వల్ల వారి సగటు వార్షిక ఆదాయం రూ.15వేలకు పెరిగింది. వైయస్ఆర్‌సీపీ పాలనలో  నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.982 కోట్ల మేర అర్థిక సాయం అందించడం జరిగింది. ఆప్కోలో కూడా కొత్త డిజైన్ల కోసం 46 ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Back to Top