రాజకీయ శుక్లాలు వచ్చిన కొందరు అధికారులకు నిజాలు కనపడవు..

డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని..

వైయస్ఆర్‌సీపీ నేతల పత్తి యాపారం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం..

తాను లేకపోతే తలలు తెగిపోయేవంటూ మాట్లాడటం దారుణం..

అంటే ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములను చంపాలని అనుకున్నారా..?

శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి కానీ గాయాలు లేవంటూ ఎలా మాట్లాడతారు..?

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం

మచిలీపట్నం:  వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్  `వైయస్ఆర్‌సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. 

వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది. ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి  ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్క్షప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైయస్ఆర్‌సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారంకు దూరం కాగానే కానీ వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు.

Back to Top