విశాఖ: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమికి వైయస్ఆర్‌సీపీ షాక్ ఇచ్చింది. కౌన్సిల్‌లో కూటమికి పూర్తి ఆధిక్యత ఉన్నా.. బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌తో అనూహ్యంగా ఒక స్థానాన్ని దక్కించుకుంది. పది స్థానాలకు కూటమి నుంచి 10 మంది, వైయస్ఆర్‌సీపీ నుంచి 10 మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు. వాస్తవానికి కౌన్సిల్‌లో 63 మంది కార్పొరేటర్ల బలం ఉన్న కూటమికే ఈ పది స్థానాలు దక్కడం లాంఛనమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అనూహ్యంగా వైయస్ఆర్‌సీపీ 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి 50 ఓట్లతో స్థాయీ సంఘం సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కూటమిపై అసంతృప్తికి నిదర్శనం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలోభాలు, బెదిరింపులతో 27 మంది వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైయస్ఆర్‌సీపీ బలం 32కు తగ్గిపోయింది. వైయస్ఆర్‌సీపీ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ సీటునూ అనైతికంగా కూటమి సొంతం చేసుకుంది. అదే తరహాలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వంపైనే కాకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకున్న మూడు నెలల్లోనే జీవీఎంసీ పరిధిలో కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైంది. వైయస్ఆర్‌సీపీ నుంచి కూటమిలోకి వెళ్లిన కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్థాయీ సంఘం ఎన్నికల్లో వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. వైయస్ఆర్‌సీపీ నుంచి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన పది మందికి 32 ఓట్లు కంటే అధికంగా పడడమే ఇందుకు నిదర్శనం. వైయస్ఆర్‌సీపీ విజయం.. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి విజయం సాధించారు. 97 మంది కార్పొరేటర్లలో 92 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 50 మంది కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. వాస్తవానికి జీవీఎంసీలో వైయస్ఆర్‌సీపీ బలం 32 ఉండగా.. అధికార కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం విశేషం. కాగా, తొలుత ఫలితం ప్రకటించలేదు. వైయస్ఆర్‌సీపీ నేతలు అడిగిన తరువాతే ఫలితాన్ని ప్రకటించారు.