ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీతో పోలీసులు పోటీ చేస్తున్నట్టుంది

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫైర్. 

పులివెందుల వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

పులివెందులలో పోలీసు రాజ్యం..

ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీతో పోలీసులు పోటీ చేస్తున్నట్టుంది..

గెలుపు కోసం సామ, భేద, దాన దండోపాయాలు చేస్తున్న టీడీపీ..

వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలపై బరితెగింపు దాడులు..

అయినా కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆవగింజంత భయాన్ని కూడా చూపలేరు..

ఇప్పుడు మీడియా పైనా దాడులకు అధికార పార్టీ ప్లాన్..

10వేల ఓట్లు కోసం 10వేల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు మోహరింపు..

అధికార పార్టీ, పోలీసుల ఆగడాలపై ధ్వజమెత్తిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

 ఈ ఎన్నిక పులివెందుల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక..

వైయస్ పేరును ఓడించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం..

అందుకోసం అడుగడుగా అక్రమాలు, అరాచకాలు..

ప్రతి కార్యకర్త ప్రాణాలొడ్డి పార్టీ గెలుపునకు కృషి చేయాలి..

మీ చొరవ చరిత్రలో నిల్చిపోతుంది..

వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన రాచమల్లు..

పులివెందుల: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం ద్వారా వైయస్ పేరుకు ఓటమి చూపించాలన్న తాపత్రయంతో అధికార టీడీపీ అడుగడుగునా  అక్రమాలకు పాల్పడుతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ... పులివెందుల ఉపఎన్నికల్లో అడుగడుగునా అధికార పార్టీ పోలీసులు అండగా బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసులు, ఎన్నికల అధికారులుతో కలిసి అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా... విజ్ఞులైన పులివెందుల ప్రజలు, వైయస్ఆర్‌సీపీకార్యకర్త వైయస్ఆర్‌సీపీ గెలుపుకోసం ప్రాణాలొడ్డి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా మీరు చూపించిన చొరవ చరిత్రలో నిల్చిపోతుందని రాచమల్లు స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

పులివెందులలో అధికార పార్టీ అరాచకం:

పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పులివెందుల మండల ఓటర్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున చేతులు జోడించి హృదయపూర్వక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందులలో ఏం జరుగుతుందో తెలియాలి. పులివెందులలో ఎన్నికల తంతు జరగడం లేదు. ఎన్నికలు అంటే ప్రచారాలు, ఓటు కోసం అభ్యర్ధనలు, అధికాపక్షం తమ పాలన గురించి, ప్రతిపక్షం ప్రభుత్వం చేయని పనులపై విమర్శలు, చివరగా నాలుగు అబద్దాలు, ఓ రెండు ప్రలోభాలు ఉంటాయి. పులివెందులలో మాత్రం అవేవీ జరగడం లేదు. తూతూమంత్రంగా ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో దాడులు చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. రక్తపాతం జరుగుతోంది. పోలీసులతో  కార్యకర్తలకు, నాయకులకు బెదిరింపులు జరుగుతున్నాయి. చివరగా ప్రజలు వేయాల్సిన ఓట్లను వారిని వేయనీకుండా రిగ్గింగులకు కూడా పాల్పడతారు. పోలీసులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఓట్లు వేసే ఆలోచనలో ఉన్నారు. గడిచిన వారం రోజులగా గమనిస్తే.. టీడీపీ నాయకులు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలమీద దాడులు చేసి తలలుపగలగొట్టి, జీపులు ధ్వంసం చేశారు. బాధితులుగా మేం ఫిర్యాదు చేస్తే.. వాటిని కాగితాలకే పరిమితం చేశారు. దాడి చేసిన వ్యక్తులు మాత్రం పెళ్లికొడుకుల్లా తిరుగుతున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని అడిగితే... . సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ కోయ ప్రవీణ్ గారు  మాకు డాక్టర్ల నుంచి దెబ్బలకు సంబంధించిన సర్టిఫికేట్ వస్తే అప్పుడు ఏ సెక్షన్ నిర్ధారించి ఆలోచన చేస్తామని బాధ్యత లేకుండా మాట్లాడారు. 

బాధితులపైనే తిరిగి కేసులా..?

అదే సందర్బంలో బాధితులైన వైయస్ఆర్‌సీపీ నేతలపై మాత్రం తిరిగి కేసులు నమోదు చేస్తున్నారు. మా పార్టీ నేతలు రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిపై ఫిర్యాదు చేస్తే సెక్షన్ 307 పెట్టామని చెప్పారు. కానీ నిందితులను అరెస్టు చేయలేదు. రెండు రోజుల తర్వాత సెక్షన్ 307 ను 324 గా మార్చి అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇస్తారు. విచిత్రంగా బాధితులైనా మా పార్టీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రి ఇతర నేతలు 50 మంది అని వారిపై.. 307తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పులివెందుల మండలంలోని 20 గ్రామాల్లో వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇతరులు 50 మంది అన్న చోట ఈ పేర్లు నమోదు చేస్తారు. అంటే ఎన్నికల నాటికి పులివెందులలో ఉన్న వైయస్ఆర్‌సీపీ నేతలను ఏరివేసి... తెలుగుదేశం పార్టీకి లైన్ క్లియర్ చేయడమే పోలీసులు ఉద్దేశం. ఇంకా పార్టీ కోసం పనిచేసే చిన్నా, చితక లీడర్లు ఉంటే వారిని బైండోవర్లు పేరుతో పిలిపించుకుని వారిని స్టేషన్లకే పరిమితం చేస్తారు. మొత్తంగా ఎన్నికల నాటికి వైయస్ఆర్‌సీపీ తరపున నాయకులు ఉండకూడదన్నదే పోలీసుల లక్ష్యంగా కనిపిస్తోంది. చివరకు పోలింగ్ రోజున మా పార్టీ తరపున చిట్టచివరి కార్యకర్తలను ఏజెంట్లుగా కూర్చొబెడితే వారిపై దౌర్జన్యం చేసి బయటకు లాగి.. పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితం చేసి మీరే ఓట్లు వేసుకుని మేం గెలిచాము అని చెప్పుకోవడానికే ఈ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. వీటికి తోడు నాలుగైదు రోజులగా మా పార్టీ నాయకులను డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఓటర్లను ప్రలోభకార్యక్రమాలకు తెరతీశారు. 

మాతో పోటీలో పోలీసులు:

మేం తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తున్నామా..? పోలీసులుతో పోటీ చేస్తున్నామా..? కేవలం వైయస్ అనే పేరు కోసం ఇదంతా చేస్తున్నారు. పులివెందులలో వైయస్ అనే పేరుకు ఓటమి లేదు. కేవలం ఆ పేరుకు ఓటమిని చూపించాలనేదానికోసం అధికార పార్టీ నేతలు ఎన్ని అడ్డదారులంటే అన్నీ తొక్కుతున్నారు. 
అందులో వీళ్లు ఎంచుకున్న మొదటి మార్గం హింస. దాని ద్వారా దాడులతో రక్తపాతం సృష్టిస్తున్నారు. రెండో మార్గం పోలీసులను, మూడోది ఎన్నికల కమిషన్ ను ఉపయోగించుకుని బూత్ లు మార్పు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నాలుగోది డబ్బు, ఐదోది నాయకులు కొనుగోలు, రిగ్గింగ్ చేసే ఆలోచన వంటి అడ్డదారులు తొక్కేది.. ఒకే ఒక్క దాని కోసం. కేవలం వైయస్ అనే ప్రజాబలాన్ని ఓడించడం కోసం అప్రజాస్వామ్యికంగా ఈ అరాచకాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా పోరాటం చేయడానికి మేం సిద్ధం. కానీ ప్రభుత్వము, పార్టీ, పోలీసులు, ఎన్నికల కమిషన్ ఇలా అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రజలందరికీ అన్ని విషయాలు అర్ధం అవుతున్నాయి. అయితే ప్రజలు ఓటేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.. పోలీసులు ఓటేస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్నది ఇప్పుడు జనంలో ఉన్న నానుడి. ఇలాంటి అరాచకాల ద్వారా విజయం సాధిస్తే ప్రజలు హర్షించరు. మేం మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నాను. మాతో  తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు, మాతో పోలీసులు పోటీ చేస్తున్నారు అన్న మాట నిజం. ఇవన్నీ చాలవన్నట్లు బయట నుంచి సాక్షి వాళ్లు వచ్చారు. వాళ్ల మీద వాళ్లే దాడి చేసుకుని మా మీద పెడతారు అని చెబుతున్నారు. అంటే మీ ఉద్దేశ్యం ప్రకారం సాక్షి మీద దాడి చేసి వాళ్ల కెమెరాలు పగలగొడతారు. వాళ్ల మీదే వాళ్లే దాడులు చేసుకుంటారని మేం ఆరోజే చెప్పాం, అదే నిజం అని నమ్మిస్తారు. అంటే ఇప్పటికే వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలమీ దాడులు చేశారు, కేసులు పెట్టారు. ఈ నిజాలన్నీ సాక్షి మీడియా చూపిస్తోంది కాబట్టి వాళ్ల మీద కూడా దాడులు చేస్తే వాళ్లు భయపడి వెనక్కి తగ్గుతారు అని చివరకు జర్నలిస్టుల మీద కూడా దాడికి వెనుకాడ్డం లేదు. ఈ రకమైన దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. మీ చర్యలను ప్రజలు హర్షించరు.  

ఇదేమి ఎన్నికల నిర్వహణ:

ఈ అరాచకాలు సరిపోవన్నట్టు... ఎప్పుడో ముప్పై, నలబై సంవత్సరాల క్రితం ఒక ఊరు నుంచి మరోక ఊరు నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఉండేది. రాను రాను పాలనా సౌలభ్యాలు, సౌకర్యాలు పెరిగి.. ఏ గ్రామానికి ఆ గ్రామంలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు విచిత్రంగా ఎర్రబల్లి, నల్లగొండువారిపల్లె, నల్లపురెడ్డిపల్లె మూడు గ్రామాలకు ఆరు పోలింగ్ బూతులు ఉన్నా... ఏ ఊరు ఓటర్లు ఆ ఊరులో ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేశారు. నల్లగొండువారి పల్లె ఓటర్లు నల్లపురెడ్డి పల్లెలోనూ.. నల్లపురెడ్డి పల్లె ఓటర్లు నల్లగొండువారి పల్లె మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి ఓటు హక్కు వినియోగించుకోవాలని మార్చారు. ఎన్నికల కమిషన్ ఏం ఆలోచన చేస్తుంది. అంటే ఏ గ్రామానికి ఆ గ్రామంలో పోలింగ్ జరిగితే.. వైయస్ఆర్‌సీపీకి మెజార్టీ ప్రజలు మద్ధతు తెలుపుతారన్న దురుద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాలు మార్పు చేశారు. పక్క గ్రామానికి వెళ్లి ఓటు వేయాలంటే కొంతమంది ఆగిపోతారన్న ఉద్దేశ్యం కొంత, ఓటింగ్ కు వెళ్తున్న ప్రజలను మధ్యలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులతో బెదిరించడానికి ఈ రకమైన మార్పులు చేస్తున్నారు.

ఆవగింజంత భయాన్ని కూడా చూపలేరు:

సామ, బేధ, దాన, దండోపాయాలతో ఒక జడ్పీటీసీని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రాయలసీమ మూడు జిల్లాల టీడీపీ నేతలంతా ఇక్కడే ఉన్నారు. 10,600 ఓట్లున్న పులివెందులకు అంతకంటే ఎక్కువ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై మాత్రం అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వేయిమందికి పైగా పోలీసులను మోహరించారు. ఇంత భారీగా పోలీసులున్నారు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎవరైనా అనుకుంటే వారు తప్పులో కాలేసినట్లే. ఈ పోలీసులంతా టీడీపీకి అనుకూలంగా పనిచేయడానికే ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలి. ఇదే విషయాన్ని ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ గారే చెబుతున్నారు. ఇంత మంది కేవలం పులివెందులలో వైయస్సార్ కుటుంబానికి ఓటమిని రుచిచూపించడానికే పనిచేస్తున్నారు. మీరు ఎన్ని కేసులు, బాధలు, కష్టాలు పెట్టినా, తలకాయలు పగలగొట్టినా.. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినా.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుండెకు  ఆవగింజంత భయాన్ని, ఓటమి కూడా మీరు చూపించలేదు. మీ పార్టీలన్నింటికి, మీ అందరి గుండెకు భయాన్ని కలుగజేసిందే.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుంచుకొండి. ఒక్క విషయం స్పష్టం చేస్తున్నాను. 2019-24 వరకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎలా ఉన్నారో మీకు తెలుసు. మీరు ఇప్పుడు ఎలాంటి దుశ్చర్యలు చేస్తున్నారో మీకు తెలుసు.  2024 నుంచి 2029 వరకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో చేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకొండి. మీరు ఇప్పుడు చేస్తున్న దుశ్చర్యలు వలన 2029 నుంచి 2024 వరకు మీరు మరో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూస్తారు. ఇప్పుడున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మరోలా మీరే తయారు చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, కడపకు, పులివెందులకు మంచిది కాదు. పోలీసులు వారం రోజులగా మీరు చేస్తున్నది మాకు, మీ అంతరాత్మకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 12వ తేదీన ప్రజలు ఓటు వేసే సమయంలోనైనా .. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, మీ తలపై ఉన్న మూడు సింహాలు, మీ ఒంటిమీదున్న ఖాకీ బట్టలు, మీ అంతరాత్మ సాక్షిగా ప్రజాస్వామ్యం కోసం, ప్రజలు కోసం పనిచేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చివరకు కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు అమలు చేయడం లేదు. కేవలం వారి వెనుక ప్రభుత్వం ఉందన్న ధీమాతోనే ఇలా చేస్తున్నారు. ఆ ఒక్కటి కూడా చేయలేకపోతే ప్రజాస్వామ్యం మిమ్నల్ని క్షమించదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మరోవైపు పులివెందుల ఎన్నికల్లో ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, నాయకుడు గెలుపే లక్ష్యంగా ప్రాణాలు ఒడ్డి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పులివెందుల మండల ప్రజలు, ఆడపడుచులు చూపించే చొరవ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Back to Top