విజయవాడ: జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో అ ధికార పార్టీ నేతల అరాచకాలను బుధవారం వైయస్ఆర్‌సీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములపై టీడీపీ నేతల దాడిని ఈసీ నీలం సాహ్నీ దృష్టికి కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్చార్జి బాలసాని కిరణ్ తీసుకెళ్లారు. ఈనెల 12న జరుగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వారు కోరారు. అనంతరం పార్టీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. హింసతో ఎన్నికల్లో గెలుద్దామని చూస్తే సహించం: మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నా వాటికి ఎన్నికలు నిర్వహించకుండా కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడమే ధ్యేయంగా చంద్రబాబు ఏరికోరి పులివెందులలో రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన టీడీపీ గూండాలను పులివెందులలో మోహరించి అధికారాన్నిఅడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. పులివెందులలో గెలిచామని ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు అనుక్షణం అలజడి సృష్టిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన క్షణం నుంచి మా నాయకుల మీద దాడులను ప్రారంభించారు. పులివెందులలో దాడులు జరుగుతాయని ముందుగానే ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎస్పీకి చెప్పానని ఎస్ఈసీ నీలం సాహ్ని చెబుతున్నారు. కానీ గ్రౌండ్‌లో చూస్తే వైయస్ఆర్‌సీపీనాయకులే లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేశారు. కడప జిల్లాలోని పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, టీడీపీ నాయకులు ఒక్కటై (హ్యాండ్ ఇన్ గ్లోవ్) తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. ఇంతవరకు ఒక్క కేసు కూడా లేని గ్రామస్థాయి వైయస్ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను ప్రచారంలో పాల్గొననీయకుండా బైండోవర్ చేస్తున్నారు. పులివెందుల రూరల్ మండలంలో ఒక్క నాయకుడు కూడా బయటకు రాకుండా కొట్టి బెదిరించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బూత్ ఏజెంట్ అనేవాడు కూడా లేకుండా చేసి ఓట్లన్నీ వారే గుద్దుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయి. అధికారమదంతో ఎవరైతే విర్రవీగి వైయస్ఆర్‌సీపీ శ్రేణుల మీద దాడులకు దిగుతున్నారో వారంతా.. రేపటి రోజున వైయస్ జగన్ సీఎం అయితే ఏం కర్మ పడుతుందో ఊహించుకోవాలి. భయభ్రాంతులను చేసి హింసతో ఎన్నికల్లో గెలుద్దామని చూస్తే కనుక మూడేళ్ల తర్వాత నా కర్మ పగవాడికి కూడా రావొద్దని ఏడ్చే రోజు కోసం వస్తుందని హెచ్చరిస్తున్నా. ఎన్నికలను హింసకి తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని విన్నవించడం జరిగింది. వైయస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్ఆర్‌సీపీ మండల నాయకుడు వేల్పుల రాముల మీద దాడులకు తెగబడ్డారు. ప్రచారం ముగించుకుని కారులో వస్తున్న మా నాయకులను టీడీపీ గూండాలు 11 కార్లతో ముందూ వెనుకా దిగ్బంధించారు. మా నాయకుల కారును ధ్వంసం చేసి వారిని కారు నుంచి బయటకు లాగి మా నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల మీద కత్తులు, కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. పథకం ప్రకారం ఈ దాడి జరుగుతోందని అర కిలో మీటర్ దూరంలో ఉన్న పోలీసులకు ముందే తెలుసు. కానీ వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తల పగిలి ప్రాణాపాయస్థితిలో ఉన్న వేల్పుల రాము, గాయాలపాలైన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లను ఆస్పత్రికి తరలించడానికి మాత్రం వచ్చారు. మేమే ఆస్పత్రిలో చేర్చామని చెప్పుకుంటున్న పోలీసులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా... ఎన్నికలను టీడీపీ నాయకులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో పోలీసులకు తెలియదా? మా నాయకుల మీద దాడులకు తెగబడతారని, ప్రచారానికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ నాయకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది కాదా? ఊరూరా షాడో పార్టీలు పెట్టలేదా? వారు ఏం చేస్తున్నారు? అధికారులే టీడీపీకి వంతపాడుతున్నారు : ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించి వస్తున్న మా నాయకులు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మీద టీడీపీ గూండాలు దాడులకు దిగడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కడపలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో గడిచిన వారం పది రోజులుగా వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద జరుగుతున్నాయని మూడు రోజుల క్రితమే ఎన్నికల కమిషనర్‌ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్, ఎస్పీని ఆదేశించామని ఆమె చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. అధికారులంతా టీడీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని ఎన్నికల కమిషనర్‌ని విన్నవించాం. పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు చేస్తున్నారు : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉప ఎన్నికల నేపథ్యంలో గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఎన్నికల కమిషనర్‌ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. నల్లగొండువారిపాలెం వెళ్లి వస్తున్న మా నాయకుల మీద టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడులు చేశారు. కర్రలు, రాడ్లు తీసుకొచ్చి తలలు పగలగొట్టారు. మూడు కార్లకు మించి వాడకూడదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా, టీడీపీ గూండాలు 30 కార్లలో వచ్చి మా నాయకులను అడ్డగించి దాడులు చేసి గాయపరిచారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బైండోవర్ కేసులతో మా గ్రామస్థాయి నాయకులను వేధిస్తున్నారు. ఈ దారుణాలపై పదే పదే ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అరాచకాలు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారు. టీడీపీ కుట్రలు పనిచేయవని స్పష్టంగా చెబుతున్నా. ఓటు అనే ఆయుధంతో ప్రజలు టీడీపీకి గట్టిగా బుద్ధిచెబుతారు. ఈసీ పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి హింసా వాతావరణం పెచ్చరిల్లిపోయింది. కుప్పంలో మణీంద్రం ఎంపీటీసీ స్థానానికి వైయస్సార్సీపీకి చెందిన దళిత మహిళ కనీసం నామినేషన్ వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకుని నామినేషన్ పేపర్లు లాక్కున్నారు. ఇప్పుడు పులివెందుల రూరల్ జెడ్పీటీసీ స్థానంలో వైయస్ఆర్‌సీపీ నాయకులే లక్ష్యంగా టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మరీ పక్క జిల్లాల నుంచి అల్లరిమూకలను దించి అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రజల మద్దతుతో గెలిచే పరిస్థితి లేదని తెలుసుకున్న చంద్రబాబు ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కారును చుట్టుముట్టి దాడులకు తెగబడ్డారు. దీనిని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. కొంతమంది పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి విధానాలు ఎంతమాత్రం మంచిది కాదు. మూడేళ్ల తర్వాత వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అధికారులు, టీడీపీ గూండాలు ఆలోచించుకోవాలి. వారందర్నీ చట్టం ముందు నిలబెట్టి శిక్షలు పడేలా గట్టిగా పోరాడతాం. ఈ దాడులను ఎన్నికల కమిషన్ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి పరస్థితులు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరడం జరిగింది. ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.