జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్..

వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేసిన కూటమి కార్పొరేట‌ర్లు
 

విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి  గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు. 
కార్పొరేటర్‌ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.

కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజు
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్‌ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.

50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు.

Back to Top