పులివెందులలో టీడీపీ అరాచకాలపై వైయ‌స్‌ జగన్‌ ఆరా 

వైయ‌స్ఆర్‌ జిల్లా: తన సొంత నియోజకవర్గం పులివెందులలో గత రెండ్రోజులుగా జరిగిన పరిణామాలపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. టీడీపీ శ్రేణుల మూక దాడిలో గాయపడిన నలుగురిని బుధవారం సాయంత్రం ఆయన ఫోన్‌ ద్వారా పరామర్శించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న అరాచ ఘటనలను తీవ్రంగా ఖండించారాయన.   
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలనే ప్రయత్నాన్ని కూటమి నేతలు చేస్తున్నారని, దీనిని బలంగా తిప్పికొడదామని వైఎస్‌ జగన్‌  ఈ సందర్భంగా బాధితులకు సూచించారు. ‘‘వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి అర్ధమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారు. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారు’’ అని జగన్‌ బాధితులతో అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత వేల్పుల రాము కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు బాధితుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపారు. 

ఈ ఇద్దరితో పాటు టీడీపీ నేత బీటెక్‌ రవి అనుచరుల దాడిలో గాయపడ్డ సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిలతోనూ వైయ‌స్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Back to Top