వైయస్ఆర్ జిల్లా: నక్కకు వాతలు పెడితే పులికాదని, టీడీపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా వైయస్ఆర్ జిల్లాలోని కడప గడ్డ..దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అడ్డా అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ మహానాడుపై మంగళవారం ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీ వైయస్ఆర్ జిల్లా కడపలో ఉద్దేశపూర్వకంగా మహానాడు జరుపుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోందని, ఇలాంటి సమయంలో వేలాది మందితో మహానాడు నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందికు టీడీపీ సంసిద్ధమైందని ఆక్షేపించారు. మహానాడు సభలో ఉన్నవారికి ఎవరికైనా కరోనా ఉంటే రాష్ట్రం అంతా విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమం అనంతరం రాష్ట్రం ఎవరైనా కరోనాతో మృతి చెందితే అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ పార్టీకి అధికారులను ఉపయోగించుకోవడం, పొదుపు మహిళలను పిలుచుకోవడం సిగ్గు చేటన్నారు. కడప నగరంలో వైయస్ఆర్ విగ్రహం చుట్టూ పచ్చ జెండాలు కట్టడం దుర్మార్గమని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.