తాడేపల్లి: ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైయస్ఆర్‌సీపీ ఆశ్చర్య వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్టు షాపులు, పర్మిట్ రూముల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం తగ్గటంపై మండిపడింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతోందంటూ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో అనేక మార్పులు చేసింది. మద్యం షాపులను తమవారి చేతిలో పెట్టారు. మద్యం దుకాణాలను విపరీతంగా పెంచారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించారు. పర్మిట్ రూమ్‌లను మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వలన సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో కూడా సహజంగా 10 శాతం వృద్ధి ఉంటుంది. కానీ అన్ని మార్పులు చేసినా ఆదాయ వృద్ధి తగ్గటం ఆశ్చర్యమేస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాకు విపరీతమైన నష్టం. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వలనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది’’ అంటూ వైయస్ఆర్‌సీపీ ట్వీట్ చేసింది.