నీట్ పేపర్ లీక్ ను మించిన స్కాం డీఎస్సీ

సీబీఐ దర్యాప్తు, లోకేష్ రాజీనామా చేయాల్సిందే

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ డిమాండ్

 విశాఖపట్నంలోని వైయ‌స్ఆర్‌సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ

డీఎస్సీని దళారుల సెలక్షన్ కమిటీగా మార్చారు

అక్రమాలపై అభ్యర్ధుల కడుపు రగిలిపోతోంది

వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలకు వచ్చిన స్పందనే నిదర్శనం

అయినా లోకేష్ కు వీరి అరణ్యరోదన వినిపించదా ?

కొండా రాజీవ్ గాంధీ సూటి ప్రశ్న

నీట్ పేపర్ లీక్ ను మించి డీఎస్సీలో అక్రమాలు

మెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటా అక్రమాలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కావాలనే తొలగించారు

ఇవన్నీ అనుమానాలకు తగిన కారణాలే

కొండా రాజీవ్ గాంధీ ఫైర్

టెన్త్ ఫలితాలకు పేపర్ యాడ్స్ ఇచ్చారుగా

ఇప్పుడు డీఎస్సీ ఫలితాలకు ఇవ్వరా ?

జిల్లాల వారీగా డీఎస్సీ ఫలితాలు బయటపెట్టండి

సీబీఐ దర్యాప్తు చేయించి నిజాయితీ నిరూపించుకోండి

కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ 

విశాఖపట్నం: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష అక్రమాలు నీట్ పేపర్ లీకేజ్ ను మించిపోయాయని, లక్షల మంది అభ్యర్ధులు వీటిపై రగిలిపోతున్నారని, వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపుకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విశాఖలో మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మౌనంగా ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నమ్ముంతుంటే.. సీబీఐ దర్యాప్తు చేయించి నిజాయితీ నిరూపించుకోవాలని కొండా రాజీవ్ గాంధీ సవాల్ విసిరారు.
 ప్రెస్ మీట్ లో కొండా రాజీవ్ గాంధీ ఇంకేమన్నారంటే...

డీఎస్సీలో అడుగడుగునా అక్రమాలే

ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు చూస్తే పూటలో పనికిమాలిన నిర్ణయం, రోజుకో దగ్గర రౌడీయిజం, వారానికో అప్పు, నెలకో కుంభకోణం, ఆరునెలకు ఎక్కడో చోట ఓ కొండను మింగేయడంలా ఉంది. రాష్ట్రంలో ఎటుచూసినా అరాచకాలు, అక్రమాలే. ఈ ప్రభుత్వ అక్రమాలపై, అన్యాయాలపై చెప్పాలంటే ఓ ప్రెస్ మీటో, ఓ రోజో సరిపోదు. డీఎస్సీ అంటే జిల్లా ఎంపిక కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్ధుల వేదన అరణ్య రోదనగా ఉంది. డీఎస్సీ అభ్యర్ధుల ఆందోళన తారా స్దాయికి చేరింది. వాళ్ల కడుపు రగిలిపోతోంది. డీఎస్సీ అక్రమాలపై ధర్నాకు పిలిపిస్తే పాడేరు నుంచి పాయకరావుపేట వరకూ, కృష్ణా నుంచి కర్నూలు వరకూ, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకూ ఎటు చూసినా రోడ్డెక్కి అభ్యర్ధులు ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్ధులు రాత్రీ పగలూ ఎంతో కష్టపడి చదివి  డీఎస్సీ పరీక్షలు రాస్తే వాళ్ల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్రంలో ఘోరమైన పాలన కొనసాగుతోంది. డీఎస్సీ అభ్యర్ధుల అరణ్య రోదన నారా లోకేష్ కు కనబడట్లేదా ? డీఎస్సీ అభ్యర్ధులు భారీగా మోసపోయారు. మా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా ఉద్యోగం ఎందుకు రాలేదని అడిగితే.. మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశామంటున్నారు. అసలు నోటిఫికేషన్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు కేటాయించారు, ఎన్ని ఇచ్చారో ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎక్కడైతే డీఎస్సీ పేపర్ తయారు చేసి అప్ లోడ్ చేస్తారో, అక్కడే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో ప్రభుత్వం చెప్పాలి. అంటే డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి కాబట్టే మీరు అతనికి ఉద్యోగం ఇవ్వలేదని మా అనుమానం. కాదంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 

నీట్ పేపర్ లీక్ ను మించిపోయిన డీఎస్సీ అక్రమాలు

నిన్న మొన్న జరిగిన నీట్ పేపర్ లీకేజ్ కన్నా భారీ కుంభకోణం డీఎస్సీ స్కాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ కు ఉంది. ఈ అన్యాయం మీకు కనిపించడం లేదా ? మాకు మంచి ర్యాంకు వచ్చింది, ఉద్యోగం ఇమ్మంటే ఏ అధికారీ సమాధానం చెప్పలేకపోతున్నారు. సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు డీమెరిట్ కాకుండా చూడమని చెప్తే.. అసలు మెరిట్ లిస్టే లేకుండా మాయం చేశారు. ఇంత మంది యువత రగిలిపోతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయారు.  ఆయనకు ఓట్లేసే యువత, మీ సినిమాలకు వచ్చే యువత నష్టపోయినా మీరు స్పందించరా ? చంద్రబాబుకు తెలిసిన పంచసూత్ర ప్రణాళికలో మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు, విష ప్రచారం ఉంటాయి. ఆయన రాజకీయంగా అనుసరించే పంచసూత్ర ప్రణాళిక. దీన్ని ఆయన కుమారుడిగా లోకేష్ పుణికిపుచ్చుకున్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని లోకేష్ ముందుకు తీసుకెళ్తున్నారు.

డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే 

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మౌన మునిలా వ్యవహరిస్తోంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ కు ఆయన శాఖపై కాదు కదా భాషపై కూడా అవగాహన లేదు. జయంతీ, వర్ధంతికీ తేడా తెలియదు. ఆయన చేతిలో విద్య వ్యవస్థ పెడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. తాజాగా పదో తరగతిలో పిల్లలు మంచి మార్కులు సాధిస్తే పేపర్ యాడ్ లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గాడిలో పెట్టిన విద్య వ్యవస్థను గాడిన పెడితే... ఇప్పుడు లోకేష్ ప్రచారం చేసుకున్నారు. అదే తరహాలో డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్ధుల వివరాలు జిల్లాల వారీగా ప్రకటనలు ఇచ్చే దమ్ము మీకు ఉందా ? అభ్యర్ధి, హాల్ టికెట్ నంబర్, మార్కులు, ఏ కోటాలో ఉద్యోగం పొందారో బయటపెట్టే దమ్ముందా ? డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, మెరిట్ లిస్ట్ ఇలా ఏ వివరాలూ చెప్పకుండా రహస్యంగా ఉంచేశారు. ఎందుకు దాస్తున్నారు, ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వారి భవిష్యత్తును ఎందుకు బుగ్గిచేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ కు ఉంది. డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ దర్యాప్తు జరిపించి మీ చిత్తశుద్ది నిరూపించుకోవాలి. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు, లోకేష్.. వారి నిజాయితీ నిరూపించుకోవాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే.  అప్పుడే అసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరో బయటపడుతుంది. అలాగే డీఎస్సీ పరీక్ష మరోసారి నిర్వహిస్తారా లేక బాధిత అభ్యర్ధులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. లోకేష్ కు నిజాయితీ ఉంటే విద్యామంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు.
 

Back to Top