మ‌హానాడులో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మౌనం

అంతా సొంత డబ్బా.. పరడబ్బాకే ప‌రిమితం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర అభివృద్ధి, సంపద సృష్టిపై మహానాడులో ఎలాంటి చర్చ జరగలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో “సంపద సృష్టించి పేదలకు పంచుతాం” అంటూ ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహానాడు పేరుతో భారీ వేదికలు, వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేసినా.. ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి అంశాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. మహానాడులో సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా తప్ప పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, తుఫాను బాధితుల సమస్యలు వంటి ప్రజా అంశాలపై చర్చే జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడు రెండు రోజుల పాటు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ పేరునే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలకే పరిమితమైందని రాచమల్లు అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకూడదని కోరిన వ్యక్తే చంద్రబాబు నాయుడని ఆరోపించారు. సంక్షేమ పథకాల సృష్టికర్తలు డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలేనని, వారు అమలు చేసిన పథకాలను కాపీ కొట్టడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి స్వంతంగా చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Back to Top