నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం

పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెర‌

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ స‌తీష్‌రెడ్డి

 హైదరాబాద్‌: ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు..నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ స‌తీష్‌రెడ్డి అన్నారు.  పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి పౌరుడికి ఉన్న ఆస్తి ఓటు.. నిజమైన స్వాతంత్ర్యం అంటే నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమేనన్నారు. ఎల్లో మీడియా నీచమైన వార్తలు రాస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘పులివెందులలో టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి దాడులకు తెగబడ్డారు. మరణాయుధాలతో దాడులు చేసి చాలామందిని గాయపరిచారు. ఎస్పీని కలిసి పులివెందుల వచ్చే లోపే ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, వేల్పుల రాముపై దాడి చేశారు. వారు ఉన్న కారుపై పెట్రోల్‌ పోసి చంపడానికి యత్నించారు. ఇప్పటికీ వేల్పుల రాము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదు. తిరిగి మా వాళ్లపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు’’ అంటూ సతీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

‘‘గ్రామాల్లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్‌ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ  అవినాష్‌రెడ్డిని వేధించారు. నన్ను కూడా అక్రమంగా నిర్బంధించారు. జడ్పీటీసీ ఎన్నిక కోసం 700 మంది పోలీసులను పెట్టారు. 3 వేల మందికిపైగా టీడీపీ గూండాలను పులివెందులలో దింపారు. టీడీపీ గూండాలకు  పోలీసులు కొమ్ము కాశారు. పోలింగ్‌ బూతులకు ఓటర్లను రాకుండా అడ్డుకున్నారు. వచ్చిన ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కున్నారు. 13 బూత్‌ల్లోకి మీడియాను కూడా అనుమతించలేదు’’ అంటూ సతీష్‌రెడ్డి దుయ్యబట్టారు.

‘‘పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నిక జరిగిందని ఎల్లో మీడియా రాయడం విడ్డూరం. ఈ దిగజారిన వార్తలు చూసి సిగ్గుపడే పరిస్థితి. వైఎస్‌ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల్లో ఏనాడు ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. టీడీపీ ఏనాడు ఎన్నికల్లో పులివెందుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేయలేదు. అలాంటప్పుడు 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదని ఎలా వార్తలు రాస్తారు..?. గతంలో మేం టీడీపీలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలవడం నిజం కాదా..?

పులివెందుల్లో కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని తీసుకుచ్చింది. టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. వారు దొంగ ఓటర్లు కాదు అని నిరూపించగలరా..?. జిల్లా కలెక్టర్ తను ఉన్న ఫోటోలో దొంగ ఓటర్ ఉన్నాడని గ్రహించి ఫోటోను డిలీట్ చేయలేదా..?. 700 మంది పోలీసులు బూత్‌లను స్వాధీనం చేసుకుని దొంగ ఓటర్లతో పోలింగ్ చేయించారు. దొంగ ఓట్లతో గెలిచిన వ్యక్తిని సీఎం సతీమణి అభినందించడం దారుణం’’ అని సతీష్‌రెడ్డి మండిపడ్డారు.

Back to Top