చంద్ర‌బాబు మనీలాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

చంద్రబాబు ఇప్పటి వరకూ ఎందుకు స్పందించడం లేదు

అమరావతి విషయంలో తనతో పాటు తన వారంతా లాభం పొందేలా చేశారు

ఐటీ అడిగిన లంచాల వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదు

స్టేలు తెచ్చుకుని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

చంద్రబాబు అవినీతిపై విచారణను ముమ్మరంగా చేయాలి.

తాడేప‌ల్లి: మ‌నీ లాండ‌రింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్ర‌బాబుకు నోటీసులు ఇస్తే ఇంత‌వ‌ర‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు. ఇందులో విదేశీ ద్రవ్యం ఉంది. షెల్‌ కంపెనీలు ఉన్నాయి. ఏడాది కాలం పాటు ఐటీ శాఖ నోటీసులతోనే కాలయాపన చేస్తోంది. అసలు విషయాన్ని పక్కన పెట్టారు. దీని తరువాత ఏమవుతుందో తెలియడం లేదు. తక్షణమే ఈ విషయంలో లీగల్‌గానో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇందులో ఉన్న కోణాన్ని తేల్చాలి. అన్ని వ్యవస్థలు ఇందులో పాల్గొని నిజనిజాలు నిగ్గు తేల్చాలి. చంద్ర‌బాబు తీరుపై 2019లోనే ప్రజా తీర్పు వచ్చింది. త్వరలో 2024 ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలి. మీడియా కూడా ఈ విషయాలను బయటకు తీసుకురావాలని కోరారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

  స్పందించరా?.. మాట్లాడరా?..:
    చంద్రబాబునాయుడు అవినీతి వ్యవహారంపై నిన్న, ఈరోజు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. ఆయన పదవిలో ఉన్నప్పుడు కొందరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చి, షెల్‌ కంపెనీల ద్వారా కిట్‌ బ్యాగ్స్‌ ఎలా తీసుకున్నారనే దాన్ని సాక్ష్యాధారాలతో సహా, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన కధనాలు వచ్చాయి. ఆ నోటీసు చూసినట్లు కూడా ఆ కధనాల్లో రాశారు. నిన్న హిందుస్తాన్‌ టైమ్స్‌లో స్టోరీ వస్తే, ఈరోజు డెక్కన్‌ క్రానికల్‌లో ఆ నోటీసు స్కాన్‌ కాపీతో సహా స్టోరీ వేశారు.
    ఆ నోటీసుపై సమాధానం చెప్పాలని నిన్న మా పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈరోజు నోటీసు స్కాన్‌ కాపీ కూడా బయటకు వచ్చింది. కనీసం ఇప్పుడైనా టీడీపీ నేతలు స్పందిస్తారా? దానిపై మాట్లాడతారా?

బాబు అవినీతి బట్టబయలైంది:
    ఆ నోటీసులో ఏముందన్నది స్పష్టంగా చెబుతూ జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి. అంతేతప్ప అందులో ఎలాంటి ఊహాగానాలు లేవు. ఎందుకంటే గతంలో నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలన్నీ ఇప్పుడు బయట పడిన నోటీసులో స్పష్టంగా ఉన్నాయి. అంటే చంద్రబాబునాయుడుకు అన్నీ తెలుసు.
    నిజానికి గతంలో చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంటిలో సోదాల్లో అవన్నీ బయటపడ్డాయి. అదే విధంగా మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని అనే వ్యక్తి ఇల్లు, ఆఫీసులో జరిగిన సోదాల్లో కూడా చంద్రబాబు అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ రెండింటి ద్వారానే బాబు అవినీతి గుట్టు బట్టబయలైంది.

అందుకే ఐటీ వివరణ కోరింది:
    ‘రూ. 118.98 కోట్లు. రెండు కంపెనీలు. ఎల్‌ అండ్‌ టీ. షాపూర్‌ పల్లోంజీ. ఆ రెండింటికీ మీరు పనులు అప్పగిస్తే, వాటి నుంచి మీ షెల్‌ కంపెనీల ద్వారా మీకు ఆ సొమ్ము చేరినట్లు.. మాకు బలమైన సాక్షాలు దొరికాయి. కాబట్టి రూ. 118.98 కోట్ల ఆదాయాన్ని మీరు ప్రకటించలేదు. దానిపై లెక్కలు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు దానికి వివరణ ఇవ్వాలంటూ’.. ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.

అన్నీ వాస్తవాలు కాబట్టే..:
    ఒకవేళ ఇందులో వాస్తవం లేకపోతే.. ఇప్పటికే చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ఘాటుగా స్పందించే వారు. కానీ వారు మౌనం పాటిస్తున్నారు. అది ప్రజల సొమ్ము. ఐటీ శాఖ అన్ని ఆధారాలతో ప్రశ్నిస్తూ నోటీసు ఇచ్చింది. కానీ దానికి చంద్రబాబు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, లోకేశ్‌ కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. స్పందించలేదు. ఈ విషయం బట్టబయలై రెండు రోజులు గడిచినా.. చంద్రబాబు నుంచి స్పందన లేదు. 

రకరకాల సాకులతో కాలయాపన:
    ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు నాలుగుసార్లు సమాధానం ఇచ్చారు. 2022 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆయన సమాధానం చెప్పారు. అయితే ఆ సమాధానాలు సంబంధిత విషయంపై కాకుండా, సాంకేతిక అంశాలు ప్రసావించారు. జ్యూరిస్‌డిక్షన్‌ను ఒకసారి, తగిన మెటేరియల్‌ లేకుండానే ప్రశ్నలు అడిగారంటూ మరోసారి వివరణ ఇచ్చారు. అలా ఎప్పటికప్పుడు ఏదో సాకు చెబుతూ పోయాడు తప్ప, ఐటీ శాఖ స్పష్టంగా అడిగిన రూ. 118.98 కోట్లకు లెక్కలు మాత్రం చెప్పలేదు. చంద్రబాబుది ఎప్పుడైనా అదే వైఖరి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థల మేనేజ్‌మెంట్‌తోనే గడిపాడు. చాలా కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. 
 
ఆనాడే ప్రశ్నించాం:
    సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులను ఎల్‌ అండ్‌ టీ. షాపూర్‌ పల్లోంజీ కంపెనీలకు పనులు అత్యధిక ధరలకు ఇచ్చారు. అది ఆరోజే స్పష్టంగా కనిపించింది. దానిపై మేము ఆనాడే ప్రశ్నించాము కూడా. అలాగే నిరుపేదల ఇళ్ల నుంచి కూడా చంద్రబాబు లాభం పొందాడు.
అమరావతి పేరుతో చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డాడు. దాన్ని ఒక కామధేనువుగా ఉపయోగించుకున్నాడు.
    ప్రధాని మోదీ సైతం చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నాడని అన్నారు. ఇది అంత కంటే అతి హేయమైన అవినీతి. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమ వ్యవహారం.

చదరపు అడుగుకు రూ.10 వేలు!:
    అసెంబ్లీ, సెక్రటేరియట్‌ తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం ఇచ్చిన రేటు అత్యంత అవినీతిమయం. హేయం. 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌ ఏకంగా రూ. 600 కోట్లకు పైగానే. అంటే ఒక్కో చదరపు అడుగుకు రూ. 10 వేలకు పైగా చెల్లించారు.
    ఇంకా పేదల ఇళ్ల (టిడ్కో) నిర్మాణంలో చదరపు అడుగుకు రూ. 2200 చొప్పున ఇచ్చారు. నిజానికి అప్పట్లో ఆ ఇంటి నిర్మాణంలో ఎస్‌ఎఫ్‌టీకి రూ. 1000 కి మించి కాదు. కానీ పేదల జేబు కొట్టి.. వారిని కూడా దోచుకున్న ప్రభుత్వం చంద్రబాబుది. పేదలు తమ ఇంటి కోసం అప్పు చేస్తే.. దాన్ని వారు 20 ఏళ్ల పాటు తిరిగి చెల్లించేలా చేశారు.
    అలా రాజధానిలో నిర్మాణాలు, నిరుపేదల ఇళ్ల (టిడ్కో)లోనూ చంద్రబాబు దుర్మార్గమైన అవినీతి ఆరోజు అందరికీ తెలిసినా.. ఇప్పుడు ఆ ఆధారాలు బయట పడ్డాయి.

రాజధానిపై చిత్తశుద్ధి లేనేలేదు:
    ఆరోజు ఆ రేట్లు చూడగానే.. అర్ధం అయింది. అది ‘టిప్‌ ఆఫ్‌ ఐస్‌బర్గ్‌’. ఎందుకంటే.. చదరపు అడుగుకు రూ. 10 వేల చొప్పున చెల్లించారు. దాంతో అప్పుడే అర్ధమైంది.. అది పూర్తిగా ఒక స్కామ్‌ అని.
ఇక అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన అవినీతికి అంతు లేదు. కేవలం రాజధాని నిర్మాణాల ప్లానింగ్‌కే కన్సల్టెన్సీలకు వందల కోట్లు ఇచ్చారు.
    చంద్రబాబుకు రాజధానిపై ఏనాడూ చిత్తశుద్ధి లేదు. నిజానికి ఆయనకు రాజధాని కట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఆ పేరుతో అడ్డగోలుగా దోచుకోవడమే బాబు ప్రణాళిక. రాజధాని పేరుతో చంద్రబాబు తరతరాలకు సరిపోయే ఆస్తి సంపాదించాడు.

ఇప్పుడైనా మౌనం వీడాలి:
    ఎప్పటికప్పుడు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. బయటపడే చంద్రబాబు, ఇప్పుడు ఐటీ నోటీసుల విషయంలో కూడా ఏదో విధంగా వ్యవస్థలను మేనేజ్‌ చేయడం కోసం విశ్వప్రయత్నం చేస్తాడు. ఆనాడు అసాధారణ రేట్లకు పనులు ఇచ్చినప్పుడే అందరూ ప్రశ్నించారు. ఇవాళ దానిపై పక్కా ఆధారాలు లభించాయి కాబట్టి.. చంద్రబాబు ఇప్పటికైనా స్పందించాలి. మౌనం వీడాలి. ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలి అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

 అంత అత్యవసరం కాదు:
    వన్‌ నేషన్‌. వన్‌ ఎలక్షన్‌. మొదట్లో అలాగే జరిగాయి. ఆ తర్వాతే పరిస్థితి మారింది. జాతీయ పార్టీల ప్ర‌భావం తగ్గి, ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిన తర్వాత.. రాష్ట్రాల్లో పూర్తిస్థాయ ప్రభుత్వాలు కొనసాగక, ఎన్నికల షెడ్యూల్‌ మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల నిర్వహణ అత్యంత వ్యయంతో కూడుకుంది.
     అన్ని సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారం అనుకోవడం కూడా సరికాదు. ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి. 

విస్తృత చర్చ జరగాలి. ఏకాభిప్రాయం రావాలి:
    అమెరికా వంటి దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. చాలా పార్టీలు ఉన్నాయి. అందుకే దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. ఏకాభిప్రాయం రావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ కూడా చాలా వ్యయంతో కూడుకున్నది కాబట్టి.. మార్పు దిశగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లోపే అది జరుగుతుందని అనుకోవడం లేదు.

Back to Top