దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు ఆశయం

య‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

రామోజీ రావు సహకారంతో కుట్రలు అమలు

ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణం

తాడేప‌ల్లి:  దోచుకోవ‌డం..పంచుకోవ‌డ‌మే చంద్ర‌బాబు ఆశ‌య‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. నాడు రామోజీరావును అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని, టీడీపీ పార్టీని లాక్కుకున్నార‌ని, ఇప్పుడు కూడా అదే కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

మతి భ్రమించి పరాకాష్టకు చేరిందా?:
    ఏటా మేము వైయస్సార్‌గారిని స్మరించుకుంటుంటే, ఆయన దార్శనికతను తల్చుకున్న ప్రతిసారి చంద్రబాబు ఏదో ఒక విధంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తొలిసారిగా తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు. సెప్టెంబరు 1, 1995న తాను సీఎం పదవి అధిష్టించిన రోజంటూ, మీడియాతో నిన్న మాట్లాడారని పత్రికల్లో చూశాం. దాన్ని ఎల్లో మీడియా ఘనంగా చూపింది. ఇవాళ కూడా కమిటీ సమావేశం పేరుతో మీడియాను ఎదురుగా కూర్చోబెట్టుకుని, అనర్గళంగా తనకు తాను ఘనంగా చెప్పుకొచ్చాడు. తాను సీఎం పదవి చేపట్టి 27 ఏళ్లు అయిందని మరోసారి గుర్తు చేశారు. అంటే దాదాపు 30 ఏళ్లు. 
    2004లో మహానేత వైయస్సార్‌ తిరుగులేని నాయకుడిగా గెల్చి, పార్టీని గెలిపించి సీఎం పదవి చేపట్టారు. అదే తరహాలో 2019లో కూడా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ స్థాయిలో తానూ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే ప్రజలు అజ్ఞానులు అనుకుంటున్నాడా? లేక ఆయన మతి భ్రమించి పరాకాష్టకు చేరిందా? లేక బరితెగింపా?

వెన్నుపోటుతో పదవి:
    1994లో ఎన్టీ రామారావు అఖండ మెజారిటీతో గెల్చి సీఎం అయ్యారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఈనాడు రామోజీరావుగారి సహకారంతో, వ్యవస్థలో ఉన్న అనుకూలత వల్ల చంద్రబాబు 1995 సెప్టెంబరు 1న సీఎం అయ్యారు. అందుకు ఆ ఏడాది ఆగస్టులో కుట్రకు తెర లేపాడు. నిజానికి అప్పుడు చంద్రబాబు వెంట కనీసం 30 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా, ఈనాడులో అసత్యాలు రాసి, ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టించాడు. అలా గవర్నర్‌ను కూడా అనుకూలంగా మార్చుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజామోదంతో కాకుండా, వెన్నుపోటుతో సీఎం అయినానని చెప్పుకోవాలి.

మాఫియా సంస్థలా పార్టీ:
    కానీ ప్రజలు ఎన్నుకున్న సీఎంగా, ప్రజలు తనకే తీర్పు ఇచ్చినట్లుగా, ఎన్టీఆర్‌తో కలిసి తాను తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినట్లుగా చంద్రబాబు వ్యవహరించాడు. ఆయన దుస్సాహసం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకపోయిన ఎన్టీ రామారావు 6 నెలల్లోనే ప్రాణాలు విడిచాడు. 1996 జనవరిలో ఆయన పరమపదించారు.
    ఇవాళ కూడా తిమ్మిని బమ్మిని చేయడం, అసత్యాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే.
చంద్రబాబు ఆనాడు నేరం చేశాడు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. మామకు వెన్నుపోటు పొడిచి నేరం చేశాడు. ఆ విధంగా పార్టీని కబ్జా చేసుకుని, దాన్ని ఇవాళ ఒక అక్రమ వ్యాపార మాఫియా సంస్థ మాదిరిగా తయారు చేశాడు.

అధికార యావ తప్ప..:
    తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా దోచుకోవచ్చు అని అనుకుంటూ.. తమ నాయకుడు ఎప్పుడూ అండగా ఉంటాడు.. కాబట్టి ఎప్పుడు అధికారంలోకి వస్తే, ఎలా దోచుకోవాలి అని చూసే.. దుష్ట చతుష్టయం.. ఎల్లో మీడియా.. అద్దెకు తెచ్చుకున్న వారితో పార్టీని నడుపుతున్నాడు. అదే నిన్న, ఇవాళ కూడా కనిపిస్తోంది. చివరకు నిన్న మాట్లాడుతూ కూడా.. ఓడిపోయినందుకు తాను ఏదో పొరపాటు చేశానని చెప్పుకున్నారు. నేను పాలనలో మునిగిపోయి, పార్టీని పట్టించుకోక పోవడం వల్ల దెబ్బ తిన్నానని, లేకపోతే తామే అధికారంలో ఉండేవాడినని అన్నాడు.
    అంటే అక్కడ కూడా ఆయనలో రాని మార్పు కనిపిస్తోంది. ఆయన ఆలోచనలో పార్టీ, అధికారం తప్ప, ప్రజలు లేరు. ప్రజలను పట్టించుకోక పోవడం వల్ల అనడం లేదు. పార్టీని పట్టించుకోలేదని అన్నాడు. అంటే పాలనలో ఎలా దోచుకోవాలి. తన ముఠాతో కలిసి ఇంకా ఎలా దోచుకోవాలి అన్న యావే తప్ప, ఎక్కడా ప్రజల ప్రస్తావన ఉండదు. కేవలం ప్రజలకు బుద్దిలేదు అని అన్నప్పుడే ఆయనకు వారు గుర్తుకు వస్తారు.
    ప్రజలు తనను ఎందుకు ఎన్నుకోవాలి? అని చంద్రబాబు ఆలోచించడు. ఎందుకంటే ఆయన ప్రజల నుంచి రాలేదు. ప్రజా నాయకుడు కాదు. అడ్డదారిన వెన్నుపోటుతో పదవి పొందాడు.

ఈ చరిత్ర చెబితే బాగుండేది:
    ఆనాడు ఎన్టీ రామారావు అనే మహా నాయకుడు తన మాట వినడం లేదని, మింగుడు పడడం లేదని తేలడంతో, ఆయనను నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పడేశాడు. ఆ బొమ్మ చంద్రబాబు అయితే, ఇవాళ ఆయనను నిలపడం కోసం రాధాకృష్ణ, చిన్నాచితకలు తయారయ్యారు. వీటన్నింటిని మేనేజ్‌ చేయడం కోసం విదేశాల్లో మూలుగుతున్న లక్షల కోట్లు ఎప్పటికప్పుడు వస్తుంది. దాన్ని మేనేజ్‌ చేయడం కోసం ఒక వ్యవస్థ. అన్ని వ్యవస్థల్లో తన మనుషులను దూర్చి మేనేజ్‌ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. ఆ డబ్బుతో దాన్ని ఇంకా మెరుగుపర్చుకోవడం. ఇదీ చంద్రబాబు చరిత్ర. అది చెబితే బాగుంటుంది.

దింపుడు కల్లం ఆశ:
    ఇవాళ ఇదే మీడియా ప్రయత్నం చేస్తోంది. దింపుడు కల్లం ఆశతో.. మృతదేహంలా మాదిరిగా మారిన ఒక నాయకుడు, వ్యక్తిని 2024 ఎన్నికల కోసం సింగారం చేస్తున్నారు.
    ఇవాళ ‘ఆంధ్రజ్యోతి’లో ఒక వార్త వచ్చింది. మోదీ ఆయనను అడిగాడట. 100 ఏళ్ల భారత్‌ ఎలా ఉండాలనుకుంటున్నారో.. మీ సలహాలు, సూచనలు ఇవ్వమన్నారట. అందుకోసం కొందరు ఇప్పుడు ఒక టీమ్‌ పని చేస్తోందట. దాన్ని మోదీగారికి అందజేస్తే, 25 ఏళ్ల తర్వాత ఆయన దాన్ని అమలు చేస్తాడట. ఆ విధంగా భారత్‌ను శాశ్వతంగా ఒక వెలుగులోకి తీసుకుపోతారట. ఆ స్థాయిలో వారి పైత్యం పెరుగుతోంది. 
    మొన్నే మాకో విషయం తెలిసింది. అమిత్‌షాను రామోజీరావు అడిగారట. చంద్రబాబును కలవాలని. అలా అయితే మిమ్మల్ని కూడా నేను కలవనని అమిత్‌షా అన్నారట. ఒకవేళ అమిత్‌షా, చంద్రబాబు కలిసినా మాకు ఏ ఇబ్బంది లేదు.

సూటిగా చెప్పొచ్చు కదా?:
    చంద్రబాబు లేకపోతే తమకు కష్టమవుతుంది కాబట్టి, టీడీపీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అనుకూల మీడియా రాసింది. దాన్నే మీడియా అడిగితే, దాన్ని ఆ పత్రిక వారినే అడగాలని చంద్రబాబు అన్నారు. 
    మా పార్టీకి ఒక స్పష్టత ఉంది. మాకు పొత్తులు అవసరం లేదు. ప్రజల విశ్వాసంతో గెలవాలి. వారి మన్నన పొంది, మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లాలి. అంతే తప్ప, పొత్తులు, అవగాహనలతో కాదు. మరి దీన్నే చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఆయన గురించే కదా ఆ పత్రిక రాసింది. ఎందుకంటే పార్టీ పొత్తు గురించి చంద్రబాబే కదా చెప్పాల్సింది.
    తనకు నమ్మకం, విశ్వాసం ఉంటే సూటిగా చెప్పొచ్చు కదా? తమకు ఎవరి పొత్తు అవసరం లేదని. లేదా తానే రాయించుకున్న కధ కాబట్టి, చేయించుకున్న కధ కాబట్టి, పొత్తు కోరుతున్నామని చెప్పొచ్చు. కానీ అలా చెబితే పరువు పోతుందని అలా సమాధానం ఇచ్చి ఉండొచ్చు.

పతనమైన రాజకీయం:
    ఇక్కడ ఎక్కడా ప్రజల ప్రస్తావన లేదు. కేవలం ఎన్నికల టెంపో డెవలప్‌ కోసమే ఆ ప్రయత్నం. అదే విధంగా సెల్ఫ్‌ హిప్నోసిస్, పార్టీ కేడర్‌లో విశ్వాసం పెంచే ప్రయత్నం, ఆ విధంగా జగన్‌గారిని ఓడించ వచ్చని భ్రమలు కలిగించే యత్నం.. ఆ దిశలోనే ఇవన్నీ. అందుకే పవన్‌ ఒక మాట. చంద్రబాబు ఇంకో మాట. ఇద్దరూ లోపాయికారి మాటలు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడడం. వాటిని రెండు పత్రికలు. మూడు ఛానళ్లలో పదే పదే ప్రచారం చేసుకోవడం ద్వారా, ఏదో జరుగుతోందన్న భ్రమ ప్రజల్లో కల్పించే ప్రయత్నం.. ఇదే చంద్రబాబు పతనమైన రాజకీయం.

ఇప్పుడు చేస్తానంటున్నాడు!:
    కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోబోతున్నాడు. ఆ విషయం అర్థమైంది కాబట్టే, ఇటీవల తరుచూ వెళ్తూ, నానా యాగీ చేస్తున్నాడు.
మేము అడుగుతున్నాం. 30 ఏళ్లలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ఎందుకు నిర్మించలేదు. ఇప్పుడు అధికారం ఇస్తే, దాన్ని నిర్మిస్తాడట. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాడట. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయని వ్యక్తి. ఇప్పుడు అధికారంలోకి వస్తే చేస్తానంటున్నాడు.

ఒక్కటైనా చెప్పుకోగలవా?:
    పైగా నిన్న అంటాడు. సంక్షేమం తమతోనే ప్రారంభమైందట. ఆయన అమలు చేసిన ఒక్కటంటే ఒక్క పథకం ఉంటే చెప్పమనండి. ఏమన్నా అంటే అన్న క్యాంటీన్‌ అంటాడు. దాన్ని ఎప్పుడు, ఎలా మొదలు పెట్టాడో అందరికీ తెలుసు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్క పథకం అయినా ఉందా?. జన్మభూమి కమిటీలు, ఇంకుడు గుంతలు, రెయన్‌గన్‌లు, బెల్టుషాప్‌లు, నీరు చెట్టు.. ఇలాంటివి గుర్తుకు వస్తాయి.
    వాటిలో ఒక్క దాంట్లో ప్రజలు ఉన్నారా? జన్మభూమి కమిటీలు అంటే ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు. నీరు లేదు. చెట్టు లేదు. రెయిన్‌గన్‌లు. ఇవన్నీ పేపర్లపైనే. అన్న క్యాంటీన్‌లలో కూడా దోపిడినే. ఇక బెల్టుషాప్‌ల గురించి చెప్పనక్కరలేదు.

మేము గొప్పగా చెప్పగలం:
    అదే మేము చెబుతూ పోతే.. ఎన్నో ఉన్నాయి. ఆనాడు వైయస్సార్‌గారు చాలా పథకాలు మొదలు పెడితే, వాటిని ఇంకా పరుగెత్తించారు జగన్‌గారు. ఏడాదిలో క్యాలెండర్‌ ప్రకటించి, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ఈనెలలో ఇవ్వబోయే పథకాలతో కలిపి దాదాపు రూ.1.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశాం. ప్రతి పథకం పూర్తి శాచురేషన్‌ పద్ధతిలో, ఎక్కడా దళారుల ప్రమేయం లేదు.
    నిన్నటికి నిన్న వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ ఇచ్చారు. దాదాపు 62.70 లక్షల వృద్ధులకు రూ.1500 కోట్లకు పైగా పెన్షన్‌ ఇస్తున్నారు. ఆనాడు చంద్రబాబు చాలా తక్కువ పెన్షన్లు ఇచ్చారు. ఎవరైనా చనిపోతేనే, కొత్త వారికి అవకాశం వచ్చేది.

చంద్రబాబు–ఆషాడభూతి:
    సమకాలీన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఇక నిజమైన ఆషాడభూతి. అలాగే రాజకీయాల్లో ఆయన ఒక అష్టావక్రుడు. ఏ మీడియా అయితే ఆయనను తయారు చేసిందో.. అలాగే ఇప్పుడు సోషల్‌ మీడియా.. అవి రాష్ట్రాన్ని కమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రమాదం పొంచి ఉంది. వదలను బొమ్మాళి వదల అన్నట్లు..ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.
    ఆ మీడియా పెద్దాయన రాజకీయంగా చేస్తున్న పనులు అసహ్యకరంగా ఉంటున్నాయి. మామూలుగా ప్రభుత్వం చేసే పనులు, నాయకుడు మాట్లాడితే అది మీడియాలో వస్తుంది. కానీ రాష్ట్రంలో ఎల్లో మీడియా సొంతంగా కధలు తయారు చేస్తుంటే, విపక్ష తెలుగుదేశం వాటిని అస్త్రాలుగా తీసుకుంటోంది. ఎందుకంటే ఆ పార్టీ ప్రజల పార్టీగా కాకుండా ఒక మాఫియాలా మారింది.

ప్రభుత్వంపై బురద చల్లడమే..:
    చంద్రబాబు ఒక్కటంటే ఒక్కటైనా స్వయంగా మాట్లాడతారా? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన బ్యానర్‌ వార్తలు తప్ప. ఎక్కడైనా, ఏ వ్యవస్థలో అయినా ఐసొలేటెడ్, ఇన్‌డివిడ్యువల్‌ ఘటనలు ఏ కారణం వల్లనైనా జరిగితే, వాటినే వారు బ్యానర్‌ ఐటెమ్స్‌గా చూపి, ప్రభుత్వ ఫెయిల్యూర్‌గా రాయడం, వాటినే జనరలైజ్‌ చేసి ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలా అవి పత్రికల్లో రాగానే వాటన్నింటినీ గుచ్చి, చంద్రబాబు, ఆయన కుమారుడు ఉదయమే మొదలు పెడతారు.
    ట్వీట్లతో వారి కార్యక్రమాలు మొదలవుతాయి. ఆ తర్వాత జూమ్‌తో ముగుస్తాయి. ఆ మర్నాడే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు. ఆ వెంటనే చంద్రబాబు దత్తపుత్రుడు ఇంకో చోట ఒక పిలుపు ఇవ్వడం. ఆ సైకిల్‌ పూర్తి కాగానే, మరో అంశంపై పడడం.
    ఇందులో భాగంగానే చంద్రబాబు ఉవాచలు లేదా ఆయన ఉపదేశాలు, సెల్ప్‌ డబ్బాలు.. వాటన్నింటినీ అలాగే చూడాలి. రోజూ ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ లేదా మీటింగ్‌ పెట్టడం. గంటలకొద్దీ మాట్లాడడం. దానిపై మేము కూడా తిప్పికొడుతూ మాట్లాడాల్సి వస్తోంది. అలా చేయకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయి.

ఆ పత్రిక పైత్యం పెరిగింది:
    ఇటీవల నెల్లూరులో ఒక భార్య, భర్తను ఎవరో చంపితే, ఈనాడులో దానిపైనా తప్పుడు కథనం రాశారు. ఆమె టీడీపీ కార్యకర్త కాబట్టి, ఆమెను వైయస్సార్‌సీపీ నాయకులే చంపారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని రాశారు. అంటే ఆ స్థాయిలో ఆ పత్రిక పైత్యం పెరిగింది. పత్రికా విలువలు ఏనాడో వదిలేశారు. ఆ స్థాయికి దిగజారిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా దానికి రాజకీయాలు పులమడం, అందులో వైయస్సార్‌సీపీ హస్తం ఉందని రాస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు మేము ప్రతిదీ తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం.

 పోలవరంకు చంద్రబాబు శాపం:

    ఆనాడు మేము ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చాం. పోలవరం గురించి మాట్లాడాలంటే ఒక గ్రంధమే అవుతుంది. చంద్రబాబు ఆ ప్రాజెక్టు విషయంలో చేసిన పాపాలు ఇప్పటికీ శాపాలుగా మారాయి. మేము ప్రతి పని పారదర్శకంగా చేస్తున్నాం. చంద్రబాబు మాదిరిగా బస్సులు పెట్టి, జయము జయము చంద్రన్నా అని పాటలు పాడించుకోవడం లేదు.

హోదాను తాకట్టు పెట్టాడు:
    ఇక ప్రత్యేక హోదా. దాని కోసం మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. అయితే కేంద్రంపై మేము ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు తన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. దాని వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సి ఉన్నా, కమిషన్ల కోసం తాను కడతానని తీసుకున్నాడు. అలాగే 
హోదాపై ఎప్పటికప్పుడు మాటలు మార్చాడు.
    కానీ మేము చాలా ఓపెన్‌గా ఉన్నాం. ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉన్నాం. ఎక్కడా అసత్యాలు చెప్పడం లేదు. పూర్తి పారదర్శకంగా పని చేస్తున్నాం. చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం. 

కుప్పంలోనూ మాదే విజయం:
    అందుకే కుప్పంలో కూడా మా పార్టీ అఖండ విజయం సాధించింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలలో కూడా మా పార్టీ గెల్చింది. కుప్పం ప్రజలు నిజమైన అభివృద్ధి చూశారు కాబట్టే వారు ఇవాళ చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఓడించబోతున్నారు.

స్వార్థపరుడు:
    ఎక్కడ, ఏం జరిగినా దాన్ని రాష్ట్రానికి ఆపాదిస్తూ, ప్రతిదీ మా పార్టీకి, ప్రభుత్వానికి ఆపాదిస్తూ బురద చల్లుతున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరెవరినో వాడుకుంటున్నారు. వారిలో డాక్టర్‌ సుధాకర్‌ కూడా ఒకరు. అవసరం కోసం ఎత్తుకుంటారు. ఆ తర్వాత తీసి పక్కన పడేస్తారు.
    మేము నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నాం. ఇది వాస్తవం. మంత్రివర్గం కూర్పు మొదలు, అన్నింటా వారికి ప్రాతినిథ్యం కల్పిస్తున్నాం.
అందుకే చంద్రబాబుకు ఏం చేయాలో దిక్కు తోచక, నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తన అనుకూల మీడియాలో రాయిస్తున్న, వస్తున్న కధనాలను పట్టుకుని మాట్లాడుతున్నారని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top