పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం!

అధికార మదంతోనే దాడులు.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత దౌర్జన్యమే!

లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌రెడ్డి ధ్వజం

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల 
అప్పిరెడ్డి, లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌నోహ‌న్‌రెడ్డి 

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి

ఓటమి భయంతోనే వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, అభ్యర్థులపై దౌర్జన్యాలు

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణ జోక్యం

దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌

పుంగనూరు నుంచి తాడిపత్రి వరకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా దాడులు, బెదిరింపులు

అభ్యర్థుల నామినేషన్‌ హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం

స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం అవసరమైన చోట పారామిలిటరీ బలగాలను మోహరించాలి

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి స్పష్టం 

తాడేప‌ల్లి:  పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీని ఎదుర్కోలేకే నాయకులు, అభ్యర్థులపై దాడులు, బెదిరింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వ‌జ‌మెత్తారు.  స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై దాడి, దాచేపల్లిలో కొప్పుల రవికుమార్‌ నిర్బంధం, తాడిపత్రి, పత్తికొండ, రాయచోటి తదితర ప్రాంతాల్లో అభ్యర్థులను బెదిరిస్తున్న ఘటనలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, న్యాయపోరాటం కొనసాగిస్తామని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో వారు స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో వారు ఏమ‌న్నారంటే..

- ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న కూటమి ప్రభుత్వం: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే కూటమి ప్రభుత్వం దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులకు పాల్పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం చేయడం, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులకు దిగడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిందో తెలియజేస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, కిడ్నాపులు, అక్రమ కేసులతో ఎన్నికల్లో గెలవాలని చూడటం దారుణం. ప్రజలకు ఓటు వేసే హక్కు, అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. అధికారుల ఉదాసీనత

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు, ప్రభుత్వ వ్యవస్థల పాత్ర ఉందని మేం భావిస్తున్నాం. దాచేపల్లిలో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ ఇంట్లో మద్యం సీసాలు పెట్టి, ఆ తర్వాత దాడులు చేసి అక్రమ కేసుల్లో ఇరికించారని ఆరోపణలు ఉన్నాయి. పత్తికొండలో ఎమ్మెల్యే కుమారుడిని తెల్లవారుజామునే తీసుకెళ్లడం, రాయచోటిలో మంత్రి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పుంగనూరులో దాడులు జరిగే అవకాశం ఉందని ముందుగానే అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు ఎందుకు ప్రేక్షకపాత్ర వహించారు?

- ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి

రాష్ట్రంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే డజనుకు పైగా లేఖలు రాశాం. పలుమార్లు కలిసి పరిస్థితులను వివరించాం. అయినప్పటికీ దాడులు, బెదిరింపులు, నామినేషన్లకు ఆటంకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. పుంగనూరుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, అక్రమాలను అడ్డుకోవాలి. ఈ అంశాలపై మరోసారి ఎన్నికల ప్రధానాధికారిని వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేస్తాం. నామినేషన్ల తొలిరోజే ఇంతటి దాడులు జరిగితే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయి? ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి. 

- రాష్ట్రవ్యాప్తంగా దాడులు, అక్రమ కేసులతో నామినేషన్లకు అడ్డంకులు: మనోహర్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై ప్రణాళికాబద్ధంగా దాడి చేసి, పలువురిని గాయపరిచి, వాహనాలను ధ్వంసం చేశారు. దాచేపల్లిలో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమ కేసు పెట్టారు. ఈ నిర్బంధంపై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తాడిపత్రిలో చైర్మన్‌ అభ్యర్థి ఫయాజ్‌ బాషా, కౌన్సిలర్‌ అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు పెట్టడం, పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడిని అరెస్టు చేయడం, రాయచోటిలో రిజర్వుడ్‌ స్థానాల అభ్యర్థులను బెదిరించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తిరుపతిలో ఘటనలను చిత్రీకరిస్తున్న మీడియా కెమెరామన్‌పై దాడి చేసి కెమెరాను లాక్కోవడం దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం, అధికార పార్టీ వ్యక్తులకు పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి.

- ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా తగిన చర్యలు కనిపించడం లేదు. అవసరమైన చోట పారామిలిటరీ బలగాలను మోహరించి, పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం తన నియంత్రణలోకి తీసుకోవాలి. నామినేషన్లకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నామినేషన్‌ కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్న అంశంపై హైకోర్టును ఆశ్రయించాం. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో చెబుతున్నా, క్షేత్రస్థాయిలో దాడులు, బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే చర్యలపై చట్టబద్ధంగా, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తాం. దాడులకు సహకరించే పోలీసు అధికారులపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలి.

Back to Top