ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించేది లేదు 

వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి

సదుం: ప్రజాస్వామ్యానికి పునాది ప్రజల ఓటు హక్కు అని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. సదుం మండలం యర్రతివారిపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన సిబ్బంది, కాన్వాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 బెదిరింపులతో ఏకగ్రీవాలకు కుట్ర

పుంగనూరు మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీకి సిద్ధమవడంతో వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. మధుసూదన్‌ నాయుడు, రవి నాయుడులను ఈ దాడి కేసులో ప్రధాన నిందితులుగా చేర్చి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప, భయపెట్టి ఏకగ్రీవాలు సాధించడంలో ప్రతిష్ఠ లేదని స్పష్టం చేశారు.

 నో డ్యూస్‌ సర్టిఫికెట్ల జారీలో జాప్యం 

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నో డ్యూస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 15 రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికెట్లు అందడం లేదని, అభ్యర్థులు కార్యాలయంలో వేచి ఉన్న సమయంలో రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను అందించడం అధికారుల బాధ్యతని గుర్తుచేశారు.

 హామీల అమలులో ప్రతిష్ఠ ఏది? 

మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి వంటి హామీలను అమలు చేయడంలో చూపని ప్రతిష్ఠను, ప్రత్యర్థులను అడ్డుకోవడంలో చూపడం విడ్డూరంగా ఉందని సుధీర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, పేదలకు అండగా నిలవడంలోనే పాలకుల ప్రతిష్ఠ ఉండాలని అన్నారు.

 దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి 

ప్రజల ఇళ్లపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వ్యక్తులను గాయపరచడం, కుటుంబ సభ్యులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటివని సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కోవాలని, దౌర్జన్యాలతో అణచివేయాలని చూడటం పిరికిపంద చర్య అని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు.

పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని వార్డులు, పంచాయతీల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే వైయ‌స్ఆర్‌సీపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికల్లో తమ పార్టీ ఓడినా ప్రజల తీర్పును గౌరవిస్తామని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

 అభ్యర్థులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ 

అభ్యర్థులను, వారి కుటుంబ సభ్యులను బెదిరించి నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో పదవులు పొందాలని చూసేవారిపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగం ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Back to Top