మిథున్‌రెడ్డికి వైయ‌స్‌ జగన్‌ ఫోన్‌.. దాడి ఘటనపై ఆరా 

 చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారు.. పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయి 

తాడేపల్లి: రాజంపేట ఎంపీ, వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.వి. మిథున్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేసి పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని, రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారని వైయ‌స్ జగన్ ఫైర్ అయ్యారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమాలు 

హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని, రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చేశారని జగన్‌ మండిపడ్డారు. లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడికే భద్రత లేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, దాడులు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని పేర్కొన్నారు.

 చట్టపరంగా పోరాటం చేస్తాం 

రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను సమర్థంగా ఎదుర్కొంటామని జగన్‌ స్పష్టం చేశారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని, ధైర్యం, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలంటే పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని వైయ‌స్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని న్యాయస్థానాల ముందు ఉంచుతామని తెలిపారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వైయ‌స్ఆర్‌సీపీదని, హింసతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.

Back to Top