రాయచోటి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్గీయులు రాయచోటిలో అరాచకాలు, బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 44 వార్డుల్లో నామినేషన్లు వేయడానికి వస్తున్న వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చి మధ్యాహ్నం 3 గంటలకే వారిని మాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత బలంపై నమ్మకం లేక దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారని, బడుగు, బలహీన వర్గాల ఇళ్లపై దాడులు చేస్తూ పోలీసులను సైతం బూతులు తిడుతూ చిన్నచూపు చూస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. "నీకు దమ్ముంటే, ధైర్యమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించు.. మేము ప్రచారం కూడా చేయం, మెజారిటీ స్థానాలు గెలవకపోతే రాజకీయాల నుంచే వైదొలుగుతాం" అంటూ మంత్రికి సవాల్ విసిరారు. గతంలో వైయస్ఆర్సీపీ హయాంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడం, మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ చేయడం, వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం నిజమైన ప్రెస్టీజ్ అని, అవేవి చేయని వీరు ఇప్పుడు కరువు పరిస్థితులను గాలికొదిలి అభ్యర్థులను భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రాయచోటిలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల ఇళ్లపై దాడులు చేయడం, వారిని గాయపరచడం, మరోసారి దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ కక్షలతో సామాన్య ప్రజలను, వారి కుటుంబాలను వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. బాధితులకు న్యాయం చేసి, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తూ, విధుల్లో ఉన్న అధికారులను దూషించి అవమానిస్తున్నారు. పోలీసులు, అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రజల భద్రతకు భరోసా కల్పించాలి. ప్రెస్టీజ్ అంటే ప్రజలను బెదిరించి, నామినేషన్లు వేయకుండా అడ్డుకుని ఏకగ్రీవాలు చేసుకోవడం కాదు.. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలిచి నిరూపించుకోవడం. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో, పేదలకు పెన్షన్లు అందించడంలో చూపని ప్రెస్టీజ్ను ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడంలో ఎందుకు చూపిస్తున్నారు? ఎన్నికల సమయంలో మహిళలకు రూ.15 వేలు ఇస్తామని, పెన్షన్లు అందిస్తామని హామీలతో నమ్మించి మోసం చేసిన కూటమి నేతలకు ఇప్పుడు ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నా ప్రాణాలను సైతం అడ్డుపెడతాను. నామినేషన్లు వేసే ప్రతి అభ్యర్థికి, నాయకుడికి వైఎస్సార్సీపీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటాను. ఈ పదవులు కేవలం మరో రెండేళ్లే ఉంటాయని గుర్తుంచుకోండి. రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు, అధికారులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషన్, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి, రాయచోటి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.