శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట: పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి, హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని, ఓటమి భయంతోనే టీడీపీ వైయస్ఆర్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి లేదని, అందుకే ఎన్నికల్లో కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని కేంద్రాన్ని కోరినట్లు ధర్మాన తెలిపారు. ఓటర్లను, పోటీ చేసే అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో సామాన్య ప్రజలకు సైతం రక్షణ లేకుండా పోయిందని ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాడులు, బెదిరింపులతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం సరికాదని స్పష్టం చేశారు.